Udaipur Murder Case: ఉదయ్‌పూర్ లో చోటుచేసుకున్న హత్య నేపథ్యంలో రాజస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర పరిస్థితులపై చర్చించడానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు.
Rajasthan-high-level meeting: రాజస్థాన్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు అత్యంత క్రూరంగా తల నరికి చంపారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న నిందితులు.. ప్రధాని మోడీని సైతం బెదిరించారు. ఇది వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడంతో పాటు దీనికి అంతర్జాతీయంగా ఉన్న సంబంధాల వంటి అంశాలపై చర్చజరగనుందని సమాచారం.
మూడు రోజుల పర్యటన నిమిత్తం జోధ్‌పూర్‌లో ఉన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ఉదయం తన పర్యటనను రద్దు చేసుకుని జైపూర్‌కు బయలుదేరారు. ఉదయ్ పూర్ హత్య కేసులో అంతర్జాతీయ సంబంధాన్ని అనుమానిస్తూ.. "ఏదైనా ప్రణాళిక మరియు కుట్ర ఉందా? ఇది ఎవరితో ముడిపడి ఉంది? అంతర్జాతీయ లింక్ అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ వెల్లడి కానున్నాయి. కొందరు సంఘ వ్యతిరేకులు కలిస్తే తప్ప ఇలాంటి ఘటన జరగదు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని" అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు పిలిచిన సమావేశానికి సీఎస్, డీజీపీ, హోం, పోలీసు శాఖల అధికారులందరూ హాజరుకానున్నారు. కాగా, కన్హయ్యాలాల్ హత్య తర్వాత ఉదయపూర్‌లో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాజస్థాన్‌లో ముందుజాగ్రత్త చర్యగా మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను 24 గంటలపాటు నిలిపివేసిన పోలీసులు.. ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను విధించారు. రాష్ట్రంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.
మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా బంద్‌కు పిలుపునిచ్చింది. కన్హయ్యలాల్ సాహుకు పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు. హత్యకు సంబంధించి గౌస్ మహ్మద్, రియాజ్ జబ్బార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని విచారించేందుకు ఎన్‌ఐఏ, సిట్‌లు ఉదయ్‌పూర్ చేరుకున్నాయి. విచారణ అనంతరం ఎన్‌ఐఏ విచారణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత గులాబ్‌చంద్ కటారియా కూడా కన్హయ్యాలాల్ కుటుంబ సభ్యులను కలిసేందుకు ఉదయపూర్ చేరుకున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన అన్నారు. ఇప్పుడు రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
