ఉమ్మడి పౌరస్మృతితో భిన్న సమాజాల సముదాయంగా ఉన్న భారత్‌లో అసమానతలు ఇంకా పెరుగుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. యూసీసీని వ్యతిరేకిస్తూ ఆయన లా కమిషన్‌కు ఓ లేఖ రాశారు.

చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ అంటేనే భిన్న సమాజాల, భిన్న వ్యవస్థల సముదాయం అని వివరించారు. కాబట్టి, అందరికీ ఒకే విధానం తెస్తామనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సామాజిక, ఆర్థిక అసమానతలను పట్టించుకోకుండా యూసీసీ అమలు చేస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. ఫలితంగా యూసీసీతో అసమానతలు ఇంకా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన లా కమిషన్‌కు లేఖ రాశారు.

యూసీసీ అమలుతో ఏర్పడే ప్రతికూల ప్రభావాలను గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ లేఖలో ఏకరువు పెట్టారు. సమాజంలోని భిన్న వ్యవస్థలను ఇది సవాల్ చేస్తుందని, ఇది అంతిమంగా భారత వైవిధ్యతను, బహుళత్వాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. భారత్ అంటేనే భిన్న సంప్రదాయల సమాజం అని, ఇలాంటి చోట యూసీసీ ఆలోచన సరికాదని వివరించారు.

Also Read: ‘కరెంట్‌’తో రేవంత్ రెడ్డికి ‘షాక్’.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్

ఆర్టికల్ 29 అనుసరించి మైనార్టీ హక్కుల్ని భారత్ గౌరవిస్తున్నదని, ఒక లౌకిక దేశంగా గర్విస్తున్నదని ఎంకే స్టాలిన్ వివరించారు. జిల్లా, ప్రాంతీయ మండళ్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు వారి ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను కాపాడుకునే వెసులుబాటు ఉన్నదని తెలిపారు. ఈ వెసులుబాటును రాజ్యాంగం కల్పిస్తున్నదని వివరించారు. యూసీసీ అమలు చేస్తే గిరిజన సంప్రదాయాలను అది ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు

మన దేశంలో భిన్న వర్గాల అభివృద్ధి, విద్య, చైతన్యం వేర్వేరుగా ఉన్నాయని డీఎంకే చీఫ్ తెలిపారు. కాబట్టి, అందరికీ ఒకే విధానం లక్ష్యంగా అమలయ్యే యూసీసీతో అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.