Asianet News TeluguAsianet News Telugu

‘కరెంట్‌’తో రేవంత్ రెడ్డికి ‘షాక్’.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్

రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమయ్యాయి. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, ఉచిత కరెంట్‌ను వ్యతిరేకిస్తున్నదంటూ బీఆర్ఎస్ విస్తృత ఆందోళనలు చేపట్టింది. దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. స్వయంగా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి దీనిపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. త్వరలో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న సందర్భంలో రైతు పక్షపాతి ఎవరనేదానిపై చర్చ మొదలైంది.
 

revanth reddy electricity comments shocks him, congress high command had to intervene kms sir
Author
First Published Jul 13, 2023, 6:23 PM IST

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ‘కరెంట్‌’ షాక్ ఇద్దామని అనుకుంది. కానీ, దానికే ఆ షాక్ తగిలినంత పనైంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో తనకు వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో పెనుదుమారాన్ని రేపాయి. ఈ వివాదంలో బీజేపీ కనిపించలేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా వాదోపవాదాలు జరిగాయి.

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ నినాదాన్ని తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సుమారు 95 శాతం రైతులకు మూడెకరాలకు మించకుండా భూమి ఉన్నదని, వారికి రోజుకు మూడు గంటల విద్యుత్ అందిస్తే చాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. 24 గంటలు అవసరం లేదని, 8 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తే చాలని ఆయన పేర్కొన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికే షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, ఉచిత కరెంట్‌కు వ్యతిరేకం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాయి. ఉధృత నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. రైతు వ్యతిరేకి అనే మూల్యం ఎవరికైనా చేటు చేస్తుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇదో అవరోధంగానే పరిణమించింది.

బీఆర్ఎస్ దూకుడుకు ముకుతాడు వేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రయత్నించారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత జఠిలం చేశాయి. దీంతో హైకమాండ్ రంగంలోకి దిగకతప్పలేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు. రాష్ట్రంలో తొలిసారి 24 గంటలు ఉచిత కరెంట్ విధానాన్ని కాంగ్రెస్సే తెచ్చిందని నొక్కి చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ మహాకార్యాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిందని వివరించారు. కాబట్టి, రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతంగానే తీసుకోవాలని, ఇందులో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టినవే తుది నిర్ణయాలని వివరించారు. 

దీంతో కొందరు నేతలు రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీతక్క సీఎం అంటూ పార్టీ నేతల్లో ఒక అలజడి రేపారని, ఇప్పుడు ఉచిత కరెంట్ గురించి మాట్లాడుతూ పార్టీకి ఎసరు తెచ్చే పని చేశారని పేర్కొంటున్నారు. ఇది పార్టీ హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ఉన్నదని చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో 'షాక్' కొడుతున్న 'కరెంట్' రాజకీయం.. పేటెంట్ తమదే అంటున్న కాంగ్రెస్..!

పాలమూరుకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ కావాలనే రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని చెప్పారు. అంతేకాదు, సీఎం అభ్యర్థి విషయంపైనా అందరూ కలిసి మాట్లాడతారని చెప్పడంతో ఈ ప్రెస్ మీట్ వెనుక హైకమాండ ప్రోత్సాహం ఉన్నదనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ రెండు వివాదాలకు అనధికారికంగా వంశీచంద్‌ రెడ్డితో స్పష్టత ఇప్పించిందని తెలుస్తున్నది. దీంతో రేవంత్ రెడ్డికి నిజంగానే ‘కరెంట్’ వ్యవహారం షాక్ ఇచ్చిందనే చర్చ మొదలైంది.

అసలే బీఆర్ఎస్ రైతు పక్షపాతి అని పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చి కూడా ఈ విషయాన్ని జాతీయ వేదికపైనా చెప్పాలని ప్రయత్నించింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాల్లో ఇది ప్రధానంగా ఉన్నది. ఈ సందర్భంలో ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ దానిపై అగ్రెసివ్‌గా రియాక్ట్ అయింది. 

ఉచిత కరెంట్ పై వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు ఇరకాటంలో పడ్డమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతు పక్షపాతి అని బలంగా ప్రచారం చేయాల్సిన, వీలైతే నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రియాంక గాంధీ త్వరలో తెలంగాణ పర్యటించనున్న తరుణంలో రైతు పక్షపాతి  కాంగ్రెస్సే అని ఆ పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు ఇది వరకే కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ వంటి హామీలను అస్త్రంగా మలుచుకోవాలని యోచిస్తున్నారు. మొత్తంగా ఈ కరెంట్ వ్యవహారం కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చి ఓ టాస్క్‌ను అప్పగించినట్టు చేసింది. అంతేకాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ ఎపిసోడ్ షాకింగ్ పరిణామంగా కనిపిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios