బెంగళూరులో సీజన్ ఎండ్ చీరలను డిస్కౌంట్ ధరలకు అమ్ముతున్న చోట ఇద్దరు మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒక చీరను పట్టుకుని అది తనకు కావాలంటే.. తనకే కావాలని గొడవ పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
బెంగళూరు: సీజన్ ముగిసిన తర్వాత డిస్కౌంట్లతో అమ్మే చీరల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి ఆఫర్లతో అమ్మే చోటికి నేరుగా వెళ్లడం ఏమంతా క్షేమం కాదనే అభిప్రాయం ఏ మూలకో తప్పక కలుగుతుంది. బెంగళూరులో ఓ చోట సీజన్ ఎండింగ్‌లో భారీ డిస్కౌంట్లతో చీరలను అమ్మకానికి పెట్టారు. అక్కడికి మహిళలు పోటెత్తారు. ఎవరికి నచ్చిన చీరలను వారు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు ఒకే చీరను పట్టుకున్నారు. తనకు కావాలంటే.. తనకే కావాలని డిమాండ్లు చేసుకున్నారు. వదులుతావా? లేదా? అంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. నెట్టేసుకున్నారు. స్థానికులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా గొడవ పడ్డారు. చివరికి ఓ పోలీసు కూడా వారిని ఆపడానికి ప్రయత్నిస్తుండటంతో వీడియో ముగిసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మైసూరు సిల్క్ చీరలను డిస్కౌంట్ ధరలతో అమ్ముతున్న చోటికి పెద్ద మొత్తంలో వినియోగదారులు చేరుకున్నారు. ఎవరి కొనుగోళ్లలో వారు బిజీగా ఉండగా.. హఠాత్తుగా ఇద్దరు మహిళలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ మధ్యలోకి వచ్చారు. ఆ తర్వాత తిట్టుకున్నారు, బాదుకున్నారు. ఆ చీర తనకే కావాలని చిందులు వేశారు. ఎవరూ తగ్గకపోవడంతో చివరకు గొడవకు దారి తీసింది.
మల్లేశ్వరం దగ్గర మైసూర్ సిల్క్ చీరల ఇయర్లీ సేల్ దగ్గర ఇద్దరు కస్టమర్లు చీరల కోసం కొట్టుకుంటున్నారని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టి ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఆ వీడియోకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒకరేమో అవి తక్కువ ధరకు లభించేవి కాబట్టి, అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో చాలా మంది టైలర్లు, డిజైనర్లు అయి ఉంటారని, మొత్తానికి డబ్బులు సంపాదించుకోవడానికే అంటూ కామెంట్ చేశారు.
ఇంకొకరేమో అంత గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా షాపింగ్ చేస్తున్న మహిళల తీరు ముచ్చటేస్తున్నదని కామెంట్ చేశారు.
ఆ ఫైటింగ్ మర్చిపోండి.. అక్కడ డిస్కౌంట్ల తర్వాతే చీరకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉన్నదని ఇంకో యూజర్ రాశారు. ఒక్కొక్కరు ఎన్ని చీరలు పట్టుకున్నారో చూడండి.. ఏమైనా బెంగళూరువాళ్లు సూపర్ రిచ్ అంటూ కామెంట్ చేశారు.
