ఆమెకు అప్పటికే పెళ్లైంది. అయితే.. భర్తకు దూరమైంది. ఆ తర్వాత మరో యువతికి దగ్గరైంది. వారిద్దరి మధ్య బంధం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే వారి బంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

23 ఏళ్ల ఓ వివాహిత, మరో 20 ఏళ్ల యువతి పెరియమనాలిలోని ఓ మగ్గం పరిశ్రమలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్తా లైంగిక బంధానికి దారితీసింది. వీరి విషయం ఆ పరిశ్రమలో తెలియడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు.

వివాహిత భర్తతో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంటోంది. ఆమెకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆ యువతి కొట్టపాలయం ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు. వీరి బంధం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వివాహితతో దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు. 

అంతేకాదు, రాశిపురానికి చెందిన వ్యక్తితో యువతికి మే 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు. గత శనివారం, యువతి ఆ వివాహిత ఇంటికి ఉదయం 11 గంటలకు వెళ్లి కలిసింది. సాయంత్రం 3 గంటలకు ఆ వివాహిత సోదరుడు గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు.