పెళ్లిలో వేద మంత్రాలు  చదివి.. వధూవరులను వివాహ బంధంతో ఒక్కటి చేసిన పూజారితోనే నవ వధువు పారిపోయింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లాలో మంగళవారం జరిగిందీ సంఘటన.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... విధిష ప్రాంతానికి చెందిన ఓ మహిళ(21)కు ఈ నెల 7వ తేదీన సిరోజ్ అనే యువకుడితో పెళ్లైంది. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే అత్తింటిలో ఏవో కారణాలు చెప్పి పుట్టింటికి వచ్చింది నవ వధువు. అనంతరం మే 23న ఇంట్లో 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త సిరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు వీరికి పెళ్లి చేసిన పురోహితుడు కూడా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.
 
రెండు ఫిర్యాదులపై పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బయటపడింది. వినోద్ శర్మ అనే పురోహితుడు ముగ్గురు పిల్లలకు తండ్రి. అయితే ఆయనకు సదరు యువతితో రెండు సంవత్సరాలుగా శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. టోరి బగ్రోడ్‌లోని ఓ నివాసంలో వీరు సహ జీవనం చేసేవారని పోలీసులు పేర్కొన్నారు.
 
వాస్తవానికి వారిరువురూ కొద్ది రోజుల ముందే పారిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు  చెబుతున్నారు. ఇప్పుడు వీరిరువురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.