బెంగుళూరు: తమ్ముడు చనిపోయిన విషయం తెలుసుకొని ఇద్దరు అక్కలు మరణించిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని పంత్బలేకుంద్రి గ్రామంలో అబ్దుల్ మాజిద్ జమదార్ నివసిస్తున్నాడు. అతని వయస్సు 57 ఏళ్లు. అతనికి ఇద్దరు అక్కలు. పెద్ద అక్క  సహారాబీ సనాది. ఆమె వయస్సు 70 ఏళ్లు. చిన్న అక్క హుస్సేన్ బీ ముల్లా. ఆమె వయస్సు 64 ఏళ్లు.

also read:పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 90 మందికి కరోనా: మరో 150 మందికి క్వారంటైన్‌కి

ఈ ముగ్గురు చిన్నప్పటి నుండి ఒకరంటే మరొకరికి ప్రాణం. అబ్దుల్ మాజిద్ డయాబెటిస్ పేషెంట్. మాజిద్ కు గుండెనొప్పి రావడంతో అతని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షల రిపోర్టు ఉంటేనే ఆసుపత్రిలోనే చేర్చుకొంటామని పలు ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.

దీంతో  కుటుంబసభ్యులు మాజిద్ ను బెలగావిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టు రాకముందే ఆయన మరణించాడు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. మాజీద్ మరణించిన విషయం తెలిసిన చిన్నక్క హుస్సేన్ బీ ముల్లా గుండెపోటుతో చనిపోయింది.

తమ్ముడి మృతదేహాం ఇంటికి చేరేలోపుగా పెద్దక్క సహారాబీ కూడ మరణించింది. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు అక్కలు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ముగ్గురి అంత్యక్రియలను బేలగావికి సమీపంలోని పంత్బలేకుంద్రి గ్రామంలో నిర్వహించారు.