కాంగ్రెస్ పేద, మధ్య తరగతి ప్రజల పార్టీని రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెల్లిస్తున్న ధరతో రెండు సిలిండర్లు వచ్చేవని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. 

ఎల్పీజీ ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్ర‌మే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. బీజేపీ ప్ర‌భుత్వ విధానాల‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ మేరకు ఆయ‌న ఆదివారం ట్వీట్ చేశారు. 

వంటగ్యాస్ ఎల్పీజీ ధ‌ర‌ల‌ను సిలిండ‌ర్ పై రూ.50 ను పెంచుతూ ప్ర‌భుత్వం శ‌నివారం నిర్ణ‌యం తీసుకుంది. ఆరు వారాలలో ధ‌ర‌లు పెంచ‌డం ఇది రెండో సారి. ఈ నిర్ణ‌యంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సిలిండ‌ర్ ధ‌ర రూ.1,000 మార్కుకు చేరుకుంది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు కేంద్ర ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. 

రాహుల్ గాంధీ ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. ఒక ఎల్పీజీ సిలిండర్ ధర 2014 లో రూ. 410 గా ఉండేద‌ని చెప్పారు. అది నేడు రూ.999 కు పెరిగిందని పేర్కొన్నారు. ‘‘ ఇప్ప‌టి ధ‌ర‌కు అప్పుడు రెండు సిలిండ‌ర్లు వ‌చ్చేవి ! పేద, మధ్యతరగతి భారతీయ కుటుంబాల సంక్షేమం కోసం కాంగ్రెస్ మాత్రమే ప‌ని చేస్తుంది. ఇది మా ఆర్థిక విధానంలో ప్రధానమైనది ’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం ముంబైలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.999.50 ఉండగా, చెన్నైలో రూ.1,015.50, కోల్ కత్తాలో రూ.1,026గా ఉంది. వ్యాట్, ఇత‌ర స్థానిక ప‌న్నుల‌ను ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో రేట్టు మారుతూ ఉంటాయి. అధికంగా పన్నులు ఉన్న రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో ప్రతిపక్ష నాయకులు పదేపదే కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. 2021 ఏప్రిల్ నుండి ఎల్పీజీ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌రకు దాదాపుగా సిలిండ‌ర్ పై రూ.190 పెరిగింది. మార్చి 22వ తేదీ నుంచి 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వ‌చ్చాయి. లీట‌ర్ పై రికార్డు స్థాయిలో రూ.10 పెరిగింది. 

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ ఎల్పీజీ ధ‌ర‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై విమర్శ‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌స్తూ ఎల్పీజీ ధ‌ర‌ల‌ను పెంచి భార‌త ప్ర‌జ‌ల‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారని సెటైర్ వేశారు. ‘‘షాబ్ మూడు దేశాల్లో 60 ఫొటో షూట్లు పూర్తి చేసి 65 గంటల తర్వాత తిరిగి వచ్చారు. ఎల్పీజీ ధర పెంచి ప్రజలకు బహుమతిగా ఇచ్చారు ’’ అని అన్నారు

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ప‌వ‌న్ ఖేరా ఆరోపించారు. ‘‘సబ్సిడీని వదులుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. 2015-2016లో దీనిని 18 కోట్లకు, 2017లో సున్నాకు తగ్గించారు. ప్రతిరోజూ మీరు ప్రజలపై మరింత భారాన్ని సృష్టిస్తున్నారు.’’ అంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ నేడు ప్రజలు ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్ర‌జ‌ల‌కు సహాయం చేసి ఆదుకుంది. అధిక ధరల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఈ సబ్సిడీని ఇచ్చింది’’ అని పవన్ ఖేరా అన్నారు.