వేతన సవరణ డిమాండ్ తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె చేపడుతున్నారు. బుధ, గురువారాల్లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఆఖరికి ఏటీఎంలు కూడా పనిచేయవు. కేవలం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కొనసాగనున్నాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 10లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. మొత్తం 48 గంటల పాటు సమ్మె జరగనుంది. బ్యాంకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2 శాతం వేతన పెంపు ప్రకటించి ఉద్యోగులను అవమానించిందనే కారణంతో వారు ఈ ఉద్యమానికి తెరతీశారు. 

బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ప్రజల నగదు కష్టాలు మళ్లీ మొదలు కానున్నాయి. బ్యాంకులు పనిచేస్తున్న రోజుల్లో ఇప్పుడిప్పుడే ఏటీఎం కేంద్రాల్లో నగదు కనిపిస్తోంది. బ్యాంకు సెలవురోజుల్లో ఏటీఎంలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల సమ్మెతో పరిస్థితి మొదటికి వచ్చే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ 1 నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.