ఛీ.. ఇక్కడ కూడా మతమేనా.. ఎయిర్ టెల్ పై విమర్శలు

Twitter Lashes at Airtel After it 'Complies' With Customer's Demand For 'Hindu Representative'
Highlights

ఎయిర్ టెల్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్ లో ఎయిర్ టెల్ ని ట్రోల్ చేస్తూ.. ఏకిపారేస్తున్నారు. అంతలా ఎయిర్ టెల్ పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారో తెలుసా..? ఓ కష్టమర్ అడిగిన సర్వీస్ చేసినందుకు. కష్టమర్ అడిగింది చేస్తే తప్పేముంది అంటారా..? పూర్తిగా చదవండి మీకే అర్థమౌతుంది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... పూజా సింగ్‌ అనే మహిళా కస్టమర్‌ తన ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ కనెక్షన్‌లో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించమని ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసింది. కొద్ది సేపటి తరువాత కంపెనీ, కస్టమర్‌ పూజ చేసిన కంప్లైంట్‌ను పరిష్కరించడానికి షోయబ్‌ అనే సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపించింది.

అందుకు పూజా కోపంతో ‘తాను ఇండియన్‌ హిందువునని..తనకు ముస్లింల సర్వీస్‌ మీద నమ్మకం లేదని..వెంటనే షొయబ్‌ స్థానంలో మరో హిందూ సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపిచాలని’ కంపెనీకి ట్విటర్‌లో పోస్టు చేసింది. అందుకు స్పందించిన ఎయిర్‌టెల్‌ కంపెనీ వెంటనే షోయాబ్‌ స్థానంలో మరో హిందూ కస్టమర్‌ సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపించింది. కంపెనీకి తనకు మధ్య జరిగిన మెసేజ్‌ చాట్‌ను ట్విటర్‌లో పోస్టు చేసింది పూజ.

ఈ మెసేజ్‌లను చూసిన నెటిజన్లు ఎయిర్‌టెల్‌ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘మీ కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా మత దురభిమానం ఉన్న వారిని ప్రోత్సాహిస్తున్నారంటూ’ ఎయిర్‌టెల్‌ను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే.. కష్టమర్ అడిగిన సర్వీస్ ని అందించాలనే తపనతో ఎయిర్ టెల్ ఆమె అడిగినట్లు చేశారు.

కానీ.. ఓ ఉద్యోగిని అవమానించడం ఎంత వరకు సమంజశం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కూడా మతాన్ని చూస్తారా అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘ఎయిర్‌టెల్‌ కంపెనీ తన ఉద్యోగులను మతం పేరుతో వేరు చేసి చూస్తుంది.  మత దురభిమానాన్ని ప్రచారం చేసే ఇలాంటి కంపెనీ‍కి కస్టమర్‌గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇక మీదట నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఎయిర్‌టెల్‌ సేవల కోసం ఖర్చు చేయను. తక్షణమే నా నంబర్‌ను వేరే సర్వీస్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. అంతేకాక నా ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ కనేక్షన్‌లను కూడా తొలగించాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేసారు.

ఇందుకు ఎయిర్‌టెల్‌ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ ‘జరిగిన విషయానికి మేము చింతిస్తున్నాము. కంపెనీ ఎప్పుడు కూడా తన వినియోగదారులను, ఉద్యోగులను, భాగస్వాములను కుల, మత ప్రాతిపదికన వేరు చేసి చూడదం’టూ రీట్వీట్‌ చేసింది.
 

loader