ఇది దైవిక జోక్యమే... జగన్నాథుడే ట్రంప్‌ని రక్షించాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమవగా.. జగన్నాథుడే ఆయన్ను కాపాడారని ISKCON ప్రతినిధి రాధా రమణ్ దాస్ తెలిపారు. ఈ ఘటనను దైవిక జోక్యమని అభివర్ణించారు.
అమెరికాలో ఎన్నికల ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు భవనం పైనుంచి కాల్పులు జరపగా.. ట్రంప్ గాయపడ్డారు. బుల్లెట్ కుడి చెవి పైభాగంలో నుంచి దూసుకెళ్లడంతో గాయమై రక్తస్రావమైంది. అయితే, వెంట్రుక వాసిలో ట్రంప్‌కు ప్రాణ హాని తప్పింది. ఏమాత్రం తలలోకి దూసుకెళ్లినా పరిస్థితి వేరేలా ఉండేది.
అయితే, ఇదంతా దైవిక జోక్యమేనని.. ట్రంప్ చేసిన మంచి పని వల్ల దేవుడే ఆయన్ను కాపాడాడని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ‘‘అవును, కచ్చితంగా ఇది దైవిక జోక్యమే. సరిగ్గా 48 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని కాపాడారు. ఈరోజు ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర పండుగను జరుపుకుంటున్న వేళ ట్రంప్‌పై దాడి జరగడంతో జగన్‌నాథుడు ఆయన్ను కాపాడి ఆదుకున్నాడు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమెరికాలో 1976 జూలైలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించే సమయంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా రాధారమణ్ దాస్ గుర్తుచేసుకున్నారు. ఇస్కాన్ భక్తులకు రథాల నిర్మాణం కోసం అవసరమైన తన రైలు యార్డ్‌ను డొనాల్ట్ ట్రంప్ సహాయం చేశారని తెలిపారు. అమెరికాలో అప్పటి 30ఏళ్ల రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ సహాయం వల్లే విశ్వ ప్రభువు జగన్నాథుని మొదటి రథ ఊరేగింపు 1976లో న్యూయార్క్ సిటీ వీధుల్లో ప్రారంభమైందని వెల్లడించారు. ‘‘ఈ రోజు ప్రపంచం 9 రోజుల జగన్నాథ రథయాత్ర పండుగను జరుపుకుంటోందని... భయంకరమైన దాడి నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకోవడం జగన్నాథుని జోక్యాన్ని చూపిస్తుంది’’ రాధారమణ్ దాస్ అన్నారు.
1976లో ఏం జరిగిందంటే...
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు 48 సంవత్సరాల క్రితం న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలని అక్కడ భక్తులు ప్లాన్ చేశారు. ఇది అక్కడ నిర్వహించిన మొదటి యాత్ర కాగా... సవాళ్లు ఎదురయ్యాయి. న్యూయార్క్‌లోని 5th అవెన్యూలో రథయాత్రకు అనుమతి కోసం నిర్వాహకులు చాలా కష్టపడాల్సి వచ్చింది. రథాలను నిర్మించడానికి, రథయాత్రకు అనుమతులు తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. చివరకు డొనాల్డ్ ట్రంప్ భక్తులకు ఓ ఆశాకిరణంలా కనిపించారు. ఇదంతా అద్భుతం కంటే తక్కువేమీ కాదంటారు రాధారమణ్ దాస్.
రథయాత్రకు ఎలాగోలా అనుమతి దొరికినప్పటికీ భారీ చెక్క బండ్లను నిర్మించడానికి యాత్ర ప్రారంభమయ్యే మార్గానికి దగ్గర్లో ఖాళీ స్థలం దొరకలేదు. ఇందుకోసం అనేక మందిని సంప్రదించినా ఎవరూ సహాయం చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. రథయాత్ర జరుగుతుందన్న ఆశలు దాదాపు సన్నగిల్లాయి.
అదే సమయంలో పెన్సిల్వేనియా రైల్ యార్డ్ ప్రాంతం రథం తయారీకి అనువైన ప్రదేశంగా గుర్తించి దాని యజమానులను భక్తులు సంప్రదించారు. అయితే, వారంతా కుదరదని చెప్పారు. రైల్ యార్డ్‌లో స్థలాన్ని విక్రయిస్తున్నట్లు చాలా మంది యజమానులు తెలిపారు. కొద్దిరోజుల తర్వాత ఆ స్థలాన్ని డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేశారని తెలుసుకున్న భక్తులు... ట్రంప్‌ను కలవాలనుకున్నారు. అయితే, మిగతా యజమానులు 'నో' చెప్పడంతో ట్రంప్ ఒప్పుకుంటారా అన్న అనుమానంలో ఉన్నారు. అయినప్పటికీ, భక్తులు ఓ బుట్టలో ప్రసాదం, ప్రెజెంటేషన్ ప్యాకేజీతో ట్రంప్ ఆఫీస్‌కి వెళ్లారు. ట్రంప్ సెక్రటరీ వాటిని తీసుకున్నారు కానీ ‘‘ఇలాంటి వాటిని ఎప్పుడూ అంగీకరించరు. మీరు అడగవచ్చు కానీ ఆయన NO అని చెప్పబోతున్నారు’’ అని భక్తులను హెచ్చరించాడు.
మూడు రోజుల తరువాత, ట్రంప్ సెక్రటరీ నుంచి భక్తులకు పిలుపు వచ్చింది. ‘‘ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ట్రంప్ మీ లేఖను చదివారు. మీరిచ్చిన ప్రసాదం స్వీకరించారు. మీ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు’’ అని చెప్పారు. రథ యాత్ర కోసం బండ్ల నిర్మాణానికి ఓపెన్ రైల్ యార్డులను వినియోగించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. ఆపీసుకి వచ్చి అనుమతి పత్రం తీసుకెళ్లమని చెప్పారు. అలా అనుమతి పత్రాలపై ట్రంప్ సంతకం చేశారు.
ఆ తర్వాత రథయాత్రకు అనుమతి పొందడంలోనూ భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. హరే కృష్ణ ఉద్యమం తరపున అనుమతి కోసం తోసన్ కృష్ణ దాస్ అధికారులకు లిఖితపూర్వక ప్రతిపాదనను సమర్పించారు. తొలుత పోలీస్ డిపార్ట్‌మెంట్ అవుననే చెప్పింది కానీ, 5th అవెన్యూలో కొత్త కవాతులను అనుమతించడానికి వ్యతిరేకంగా 1962 నుంచి మేయర్ ఆర్డర్ ఉందని ‘నో’ చెప్పారు. చేసేది లేక తోసాన్ కృష్ణదాస్ మాన్‌హట్టన్‌లోని చీఫ్ ఆఫ్ పోలీస్‌ని సంప్రదించారు. దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించిన పోలీసు చీఫ్ చిరునవ్వుతో సంతకం చేశారు.
‘‘అయితే, ఇతర కార్పొరేట్ కంపెనీల యజమానుల మాదిరిగానే ట్రంప్ కూడా భక్తుల ప్రతిపాదనను సులభంగా తిరస్కరించవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. చివర్లో పోలీసు ఉన్నతాధికారి కూడా అనుమతించకపోయి ఉండొచ్చు. కానీ వారంతా ఎందుకు ‘నో’ చెప్పలేదు. ఇప్పటికీ ఇదో సమాధానం లేని ప్రశ్న. భక్తులు దీనిని జగన్నాథుని అనుగ్రహంగా పేర్కొంటారు.’’ అని రాధారమణ్ దాస్ గుర్తుచేసుకున్నారు.