దోస్తీ: కేసీఆర్ కు అవసరం, మోడీది ముందుచూపు

TRS open to post-poll alliance with BJP in 2019
Highlights

ముందు చూపుతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారంనాడు కేసీఆర్ ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: ముందు చూపుతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారంనాడు కేసీఆర్ ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. 

అవసరమైతే ఎన్నికల తర్వాత ఎన్డీఎకు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ ఆయనకు చెప్పారని సమాచారం. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి ఆయన సమ్మతించలేదని అంటున్నారు. 

మైనారిటీల ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ముందస్తు పొత్తుకు కేసీఆర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మద్దతు తీసుకోవచ్చుననే ఉద్దేశంతోనే కేసిఆర్ తో మోడీ సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత 50 రోజుల్లో కేసిఆర్ ప్రధానిని కలవడం ఇది రెండోసారి. ఈసారి 11 అంశాలతో కేసిఆర్ ప్రధానికి ఓ వినతిపత్రం సమర్పించారు. దాంట్లో కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయించుకోవడం కేసీఆర్ కు ఎన్నికల అవసరంగా కూడా మారింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే దానికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా మారింది. 

బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసిఆర్ ఆ ఎజెండాను పక్కన పెట్టి బిజెపికి దగ్గరయ్యారు. రాష్ట్ర అవసరాల కారణంగానే ఆయన ఈ వైఖరి తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గాలంటున్నాయి. 

తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలిగిన తర్వాత మోడీ కేసిఆర్ కు మరింత దగ్గరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభించింది. అదే సమయంలో తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోడీ కేసిఆర్ ను మెచ్చుకుంటూ చంద్రబాబును విమర్శించారు. 

loader