సబ్సిడీ రుణాల పేరుతో టీఆర్ఎస్ మైనార్టీలను అవమానిస్తోంది: కాంగ్రెస్
Hyderabad: సబ్సిడీ రుణాల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీలను అవమానిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఎనిమిదేళ్లలో మైనార్టీలకు ఒక్క రూపాయి కూడా టీఆర్‌ఎస్ రుణం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అబ్దుల్లా సోహైల్ అన్నారు.

Telangana Congress: సబ్సిడీ రుణాల పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం మైనారిటీ వర్గాలను అవమానిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మైనారిటీ విభాగం చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహైల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించడానికి మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థుల నుండి ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించిందని పేర్కొన్న ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా కేవలం 5 వేల మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందించేందుకు రూ.50 కోట్ల స్వల్ప మొత్తాన్ని కేటాయించిందని విమర్శించారు.
తెలంగాణలో మైనారిటీ జనాభా గణనీయంగా పెరింగదని పేర్కొన్న ఆయన.. దానిని అనుగుణంగా ప్రభుత్వం రుణాలు అందించడంలో చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. “తెలంగాణలో మైనారిటీ జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) 45,59,425. ఇది గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు మొదలైన అన్ని మైనారిటీ వర్గాలలో కనీసం 12-15 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు, అయితే ప్రభుత్వం కేవలం 5,000 మంది నిరుద్యోగ యువతకు సుమారు లక్ష రూపాయల రుణాన్ని అందించాలని భావిస్తోంది. ఇది రాష్ట్రంలోని అన్ని మైనారిటీ వర్గాలను బహిరంగంగా అవమానించడమే తప్ప మరొకటి కాదు" అని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్లలో మైనార్టీలకు ఒక్క రూపాయి కూడా టీఆర్‌ఎస్ రుణం ఇవ్వలేదని అబ్దుల్లా సోహైల్ అన్నారు. 2015-16 సంవత్సరంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు కోరినప్పుడు దాదాపు 1.53 లక్షల మంది నిరుద్యోగ యువత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒక్క దరఖాస్తు కూడా క్లియర్ కాలేదనీ, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటి దరఖాస్తులను స్వీకరించడం మానేసిందన్నారు. ఆర్థిక సాధికారత పథకం అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. అవి అమలుకునోచుకోని హామీలుగానే మిగిలాయని పేర్కొన్నారు.
‘‘ఏడేళ్ల విరామం తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీల నుంచి రుణ దరఖాస్తులను ఆహ్వానించింది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు పెద్ద మొత్తంలో కేటాయించడానికి బదులు కేసీఆర్ తక్కువ మొత్తంలో రూ. 50 కోట్లు కేటాయించడం మైనారిటీలను మోసం చేయడం కోసమే. ఇప్పుడు ప్రభుత్వం 5,000 మంది లబ్ధిదారులకు రుణాల పంపిణీని ఒక పెద్ద ఈవెంట్‌గా మారుస్తుంది. మైనారిటీలలో నిరుద్యోగం-పేదరికాన్ని నిర్మూలించినట్లు ముద్ర వేయడానికి ఆ చిత్రాలను ఉపయోగిస్తుంది”అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మైనారిటీ విభాగం చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు.
''17,47,608 మంది మైనారిటీ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,919 మంది లబ్ధిదారులు ఉన్నారు. మైనారిటీ జనాభా 9,492 ఉన్న జయశంకర్‌లో అత్యల్ప సంఖ్య కేవలం 10 మాత్రమే. కేటగిరీల వారీగా, అనేక జిల్లాలకు ఉద్దేశించిన లబ్ధిదారుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉంది”అని ఆయన చెప్పారు. మైనార్టీల సంక్షేమ పథకాల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని అబ్దుల్లా సోహైల్ తెలిపారు.