త్రిపుర ఎన్నికలు: మమతా బెనర్జీ మెగా రోడ్‌షో.. ఈ ప్రాంతం తనకు రెండో ఇల్లు అంటూ వ్యాఖ్యలు
Agartala: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ భారీ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అగర్తలాలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆమె ముందుకు నడిచారు.

West Bengal Chief Minister Mamata Banerjee: త్వరలో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవడానికి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిపుర ఎన్నికల్లో సత్తా చాటాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ త్రిపుర పర్యటనకు వచ్చారు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీతో కలిసి అగర్తలాలో రోడ్ షో నిర్వహించారు. అగర్తలాలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులతో మమతా బెనర్జీ కవాతు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మమతా బెనర్జీ రోడ్ షో మధ్యాహ్నం ప్రారంభమైందని సమాచారం.
28 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు మమతా బెనర్జీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి సోమవారం త్రిపుర చేరుకున్నారు. 2021లో బీజేపీ దౌర్జన్యాలు, అప్రజాస్వామిక కార్యకలాపాలు పతాకస్థాయికి చేరిన సమయంలో టీఎంసీ ప్రజలకు అండగా నిలిచి కాషాయ పార్టీ ఫాసిస్టు పాలనను అడ్డుకుందని మమతా బెనర్జీ అన్నారు. "పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సుస్మితా దేవ్, కకోలి ఘోష్ దస్తిదార్, అభిషేక్ బెనర్జీ, డోలా సేన్ తదితర ఎంపీలపై కూడా అధికార పార్టీ మద్దతుదారులు పోలీసుల సమక్షంలో దాడి చేశారు. పార్లమెంటు సభ్యులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఆ ఘటనలను ప్రజలకు మరోసారి గుర్తు చేసేందుకే తాను ఇక్కడికి వచ్చానని" చెప్పారు.
కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ చెరో రెండు ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. వరుసగా రాజకీయ ప్రముఖుల పర్యటనల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఉత్తర త్రిపుర జిల్లాలోని బగబస్సాలో, ఖోవాయ్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు ర్యాలీలు నిర్వహించనున్నారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఉనాకోటి జిల్లాలోని కైలాషహర్, పశ్చిమ త్రిపురలోని బదర్ఘాట్లో అధికార బీజేపీ రెండు ర్యాలీల్లో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాష్ట్రంలో రెండు ర్యాలీలు, రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.