Agartala: త్రిపురలో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర సీఎం మాణిక్ సాహా అన్నారు. అగర్తలాలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tripura Assembly Election 2023: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం శాంతియుతంగా ప్రారంభమైంది. ఒకవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, మరోవైపు టిప్రా మోతా కూటమితో అధికార బీజేపీ తలపడే త్రిముఖ పోరు రాష్ట్రంలో రాజకీయ హీటు పెంచింది. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ మరోసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అగర్తలాలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా గురువారం అగర్తలాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టౌన్ బోర్దోవాలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాహా ఎన్నికల బరిలోకి దిగారు. ఓటు వేసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన సాహా.. ప్రతిచోటా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని ఉదయాన్నే ప్రార్థనలు చేశానని చెప్పారు. "ప్రజలు ఓటు వేసేందుకు పెద్దఎత్తున ముందుకు రావడం మీరు చూడవచ్చు. బీజేపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. తన ముందున్న సవాలు గురించి సాహా మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే కాంగ్రెస్, వామపక్షాల కూటమి శాంతిని కాపాడాలని అన్నారు.
అందరూ ఓటును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి
ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని త్రిపుర ప్రజలను ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోరారు. యువత బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇరువురు పిలుపునిచ్చారు. "త్రిపుర ప్రజలు రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలి. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కాగా, 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, శాంతియుత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) గిట్టె కిరణ్ కుమార్ దినకర్రో తెలిపారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుందని, వీటిలో 1,100 సున్నితమైనవి, 28 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ఆయన తెలిపారు.
