నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వేడుకను తృణమూల్ కాంగ్రెస్ బాయ్‌కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. మే 28వ తేదీన ప్రధాని మోడీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
కోల్‌కతా: నూతన పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాంగ్రెస్ బాయ్ కాట్ చేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధిస్తూ టీఎంసీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. టీఎంసీ నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ఈ ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ నూతన పార్లమెంటు భవనం మొత్తం ‘నా, నాది, నాదే’ అనే ధోరణిలో ప్రధాని మోడీ ఉన్నట్టు విమర్శించారు.
పార్లమెంటు అంటే కేవలం ఒక నూతన భవంతి కాదని డెరెక్ ఒబ్రియన్ అన్నారు. ఇది ఒక వ్యవస్థ అని, పాత విలువలు, సాంప్రదాయాలు, ఆనవాయితీలు, నిబంధనలకు సంబంధించినదని వివరించారు. భారత దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని తెలిపారు. కానీ, ప్రధాని మోడీకి ఇవి అర్థం కావు అని విమర్శించారు.
ఆదివారం నాటి ప్రారంభోత్సవ వేడుక పూర్తిగా ప్రధాని మోడీ కేంద్రంగా చేసుకున్నారని పేర్కొన్నారు.
Also Read: నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని కాదు.. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ గాంధీ
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై విమర్శలు సంధించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపలేదని పేర్కొన్నారు. పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా ఆహ్వానించలేదని విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్నదని, రాష్ట్రపతి కార్యాలయానికి కేవలం స్టాంప్‌నకు ఉపయోగించుకుంటున్నదని ఆరోపణలు చేశారు.
నూతన పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇప్పుడు అదే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని పేర్కొన్నారు.
