న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం కోసం చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. కరోనా సోకిన రోగులు ఆరోగ్యవంతంగా ఇంటికి చేరడానికి ఒక్కో వ్యక్తిపై కనీసం రూ.3.5 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆసుపత్రిలో చేరడానికి ముందు నిర్వహించే పరీక్షల నుండి ప్రతిదీ కూడ ప్రభుత్వమే భరిస్తోంది.

కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. కరోనా అని తేలితే కరోనా చికిత్స చేసేందుకు నిర్ధేశించిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగులకు చికిత్స నిర్వహించేందుకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.

కరోనా నిర్ధారణ చేసేందుకు నిర్వహించే పరీక్షకు కనీసం రూ. 4500 ఖర్చు అవుతోంది. ఈ పరీక్షలో కరోనా అని తేలితే ఆ రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఈ పరీక్ష తర్వాత  మరో రెండు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మూడు పరీక్షల నిర్వహణకు గాను ఒక్కో రోగిపై రూ.13,500 ఖర్చు అవుతోంది. అనుమానితుల పరీక్షలు, రవాణా కోసం రూ. 5 వేలు ఖర్చు చేయనున్నారు. 

also read:ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 2,553 కేసులు, మొత్తం 42,553కి చేరిక

కరోనా పాజిటివ్ రోగికి  చికిత్స పూర్తయ్యేవరకు సుమారు 80 పీపీఈ కిట్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క కిట్ ధర రూ. 2500 కంటే పైనే ఉంటుంది.ఈ కిట్ల కోసం సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోంది. కరోనా వైరస్ నుండి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు యాంటీ బయాటిక్స్ ,ప్లూయిడ్స్ అందిస్తారు. వీటి కోసం సుమారు రూ. 50 వేలకు పైగా ఖర్చు.

రోగికి పౌష్టికాహారం అందించడం అనివార్యం. అల్పాహారం, భోజనం, డ్రైఫ్రూట్స్, పాలు, బ్రెడ్స్, వాటర్ బాటిల్స్ కు ఖర్చు సుమారు రూ. 55 వేలు అని అంచనా. రోగికి అవసరమైన శానిటైజర్, సబ్బులు, డ్రెస్సుల కోసం రూ. 27 వేలు ఖర్చు అవుతోందని అంచనా.