లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు పై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు రైల్వే కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయి జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.

సండిల, ఉమర్తాలి స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేస్తుండగా అకల్ తక్త్ ఎక్స్ ప్రెస్ రైలు పైనుంచి దూసుకెళ్లింది. ట్రాక్స్ పై కూలీలు నాలుగు బోల్టులను బిగించారు. వారు ఆ పని చేయకపోయి ఉంటే రైలు పట్టాలు తప్పి భారీ ప్రమాదం జరిగి ఉండేది. 

కూలీల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాదాపు 8 గంటల పాటు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించకుండా అడ్డుకున్నారు. మొరాదాబాద్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శరద్ శ్రీవాత్సవ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 

మరమ్మతులు జరుగుతుండగా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదనే విషయంపై విచారణ జరిపిస్తామని, సంఘటన ముగ్గుర సభ్యుల బృందం విచారిస్తుందని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలేసి నష్టపరిహారం ప్రకటించారు. 

నిర్లక్ష్యం వహించినందుకు గాను సీనియర్ రైలు ట్రాక్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. మరమ్మతులు చేస్తుండగా అతను దూరంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ట్రాక్స్ ను బ్లాక్ చేయడం గానీ ట్రాక్ మీదుగా వస్తున్న రైలు డ్రైవర్ ను అప్రమత్తం చేయడం గానీ చేయలేదని అధికారులు అంటున్నారు.