మణిపూర్ హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. ఎందుకంటే..: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
మణిపూర్ హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, అన్ని ఘటనలపై దర్యాప్తును ఆరు నెలల్లో ముగించేలా ఆదేశాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్వయంగా ఈ అఫిడవిట్ ఫైల్ చేశారు.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసపై దర్యాప్తును బయటి రాష్ట్రానికి బదలాయించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, మణిపూర్‌లో చోటుచేసుకున్న అన్ని హింసాత్మక ఘటనలు, నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సహా అన్నింటిపై దర్యాప్తు ఆరు నెలల్లో ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
ఈ అఫిడవిట్‌ను స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్ల దాఖలు చేశారు. తద్వార మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నదనే సంకేతాలు సుప్రీంకోర్టుకు చేరవేసినట్టయింది.
మణిపూర్‌లో హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని జులై 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాగా, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా జులై 27వ తేదీన సిఫార్సు చేసింది.
Also Read: ఎంపీ రేవంత్ రెడ్డి కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో పోస్టర్లు.. ‘వరద బాధితులను పరామర్శించలేదనే.. ’
మణిపూర్‌లోని జరుగుతున్న నేటి నేరాలు అత్యంత దారుణమైనవిగా కేంద్రం భావిస్తున్నదని, దానికి తగినంత సీరియస్‌నెస్ అవసరం అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఈ నేరాలకు తీసుకునే చర్యలు, బాధితులకు జరిగే న్యాయం గురించి దేశమంతటా తెలియాలని, ఈ చర్యలు దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను తగ్గించేలా ఉండాలని వివరించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి దర్యాప్తును అప్పగించాలని తాము నిర్ణయం తీసుకోవడానికి ఇదీ ఒక కారణం అని తెలిపింది. మణిపూర్ హింస పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.