ముంబాయిలోని భివాండిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన ఒక చిన్నారి.. మరో 40 ఏళ్ల మహిళ ఉన్నారు.

మహారాష్ట్రలోని ముంబాయిలో విషాదం చోటు చేసుకుంది. భివాండీ సిటీలో ఉన్న గౌరీపడా ప్రాంతంలో అర్ధరాత్రి రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ భవనాన్ని ఖాళీ చేయాలని మున్సిపాలిటీ అధికారులు గతంలో చెప్పినా.. వినకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రాణ నష్టం చోటు చేసుకుంది.

‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. 45 ఏళ్ల వయస్సు ఉన్న ఈ రెండంతస్తుల భవనంలో ఎప్పటిలాగే శనివారం రాత్రి సమయంలో పలువురు నిద్రపోతున్నారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా ఆ భవనం రెండుగా చీలిపోయింది. వెనుక భాగం పూర్తిగా కుప్పకూలింది. దీతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు తేరుకొని ఆ భవనం దగ్గరికి చేరుకున్నారు. వారంతా కలిసి నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

Scroll to load tweet…

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భీవండి అగ్నిమాపక దళానికి చెందిన మూడు వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వారిలో నలుగురిని సజీవంగా బయటకు తీసుకొని వచ్చారు. శిథిలాల కింద కూరుకుపోయి ఇద్దరు మృతి చెందారు. 

ఈ భవనం 45 ఏళ్ల నాటిది. ఇప్పటికే చాలా వరకు దెబ్బంతింది. అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందే గుర్తించారు. అందుకే రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఎవరూ ఆ భవనాన్ని ఖాళీ చేయలేదు. కాగా.. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం.. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని అధికారులు ప్రకటించారు. ఇందులో ఒక చిన్నారి ఉండగా.. మరొక 40 ఏళ్ల మహిళ ఉందని పేర్కొన్నారు. ఐదుగురు గాయపడ్డారని చెప్పారు.