విషాదం.. నదిలో పడ్డ బస్సు, ముగ్గురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు

ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 24 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. 

Tragedy.. Bus falls into river, 3 killed.. 24 seriously injured..ISR


జార్ఖండ్ లో విషాదం చోటు చేసుకుంది. గిరిదిహ్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. దాదాపు 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో కొంత మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. 

వివరాలు ఇలా ఉన్నాయి. పలువురు ప్రయాణికులతో కూడిన బస్సు జార్ఖండ్ లోని రాంచీ నుంచి గిరిదిహ్ వెళ్తోంది. గిరిదిహ్-డుమ్రీ రహదారిపై ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి బరాకర్ నదిలో పడిపోయింది. 50 అడుగుల ఎత్తుపై నుంచి బస్సు పడిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే గిరిదిహ్ ఎమ్మెల్యే సుదివ్య కుమార్, డీసీ నమన్ ప్రియేష్ లక్రా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించాయి. కొంత సమయం తరువాత ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని గిరిదిహ్ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్పీ మిశ్రా నిర్ధారించారు. మరో 24 మంది గాయపడ్డారని తెలిపారు. దీనిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. 

‘‘ రాంచీ నుంచి గిరిదిహ్ వెళ్తున్న బస్సు జార్ఖండ్ లోని గిరిదిహ్ లోని బరాకర్ నదిలో ప్రమాదానికి గురైందని బాధాకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.’’ అని ట్వీట్ చేశారు. కాగా.. ఈ సహాయక చర్యలను గిరిదిహ్ పోలీసు సూపరింటెండెంట్ దీపక్ శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios