కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. విల్లుపురం జిల్లాలో ఏడుగురు, చెంగల్పట్టు జిల్లాలో నలుగురు మరణించారు. 30 మందికి పైగా హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
దారుణం.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిన భర్త.. ఎక్కడంటే ?
అయితే ఈ ఘటనకు కారణమైన, కల్తీ మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. మరింత మంది అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు మొత్తం ఏడుగురు పోలీసులను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ తెలిపారు.
మృతి చెందిన వారు ఇండస్ట్రియల్ మిథనాల్ మిక్స్డ్ కల్తీ మద్యం సేవించి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు నష్టపరిహారం ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
ఇలాంటి ఘటనే గత నెలలో బీహార్ లో చోటు చేసుకుంది. 14వ తేదీన మోతీహరి జిల్లా పరిధిలోని హర్సిద్ధి, సుగౌలి, పహర్పూర్, తుర్కౌలియా, రఘునాథ్ పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారు. మొదటి రోజు ఐదుగురు మాత్రమే మరణించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. అయితే ఈ ఘటనలకు కారణమైన 76 మంది మద్యం స్మగ్లర్లను మోతీహరి పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. అయితే ఓ షరతును బాధిత కుటుంబాలు అంగీకరించాలని తెలిపారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తామంతా అనుకూలమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పారు. ‘‘ఇది బాధాకరమైన సంఘటన. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షలు ఇస్తాం. అయితే రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తాము అనుకూలమని, మద్యపానానికి తాము వ్యతిరేకమని లిఖిత పూర్వకంగా తెలియజేయాలి’’ అని అన్నారు.
