ఈ నెల 9వ, 10వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జీ 20 సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు వస్తున్నారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్‌పింగ్‌లు మాత్రం గైర్హాజరవుతున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. జీ 20 సభ్య దేశాల జబితా ఇలా ఉన్నది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది జీ 20 గ్రూపునకు భారత సారథ్యం వహిస్తున్నది. భారత సారథ్యంలో మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9వ, 10వ తేదీల్లో జీ 20 సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సదస్సుకు గ్రూపులోని దేశాల అధినేతలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల అధినేతలు, ప్రతినిధులు విచ్చేస్తున్నారు. కొన్ని దేశాల అధినేతలు అనివార్య కారణాల వల్ల రావడం లేదు. ఢిల్లీలో నిర్వహించనున్న జీ 20 సదస్సుకు హాజరుకాబోతున్న ప్రపంచ అధినేతల జాబితాను ఓ సారి చూద్దాం. దాని కంటే ముందు.. జీ 20 గ్రూపులో ఏ దేశాలు ఉన్నాయో చూద్దాం.
జీ 20 గ్రూపులో 19 దేశాలు, ఒక యూనియన్ ఉన్నది. ఈ దేశాల జాబితా ఇలా ఉన్నది.
అర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా), మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డం, అమెరికా దేశాలు ఉన్నాయి. వీటితోపాటు సంయుక్తంగా కొన్ని దేశాల తరఫున యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కలిగి ఉన్నది.
ఈ 20 దేశాలకు జీ20లో శాశ్వత సెక్రెటరీ లేదు. ప్రతి ఏడాది ఒక్కో దేశాల ఈ గ్రూపునకు సారథ్యం వహిస్తుంది. గతేడాది ఇండోనేషియా సారథ్యం వహించగా.. ఈ ఏడాది మన దేశం నాయకత్వం వహిస్తున్నది. వచ్చే ఏడాది బ్రెజిల్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా సారథ్యం వహించనున్నాయి.
ఢిల్లీకి విచ్చేస్తున్న దేశాధినేతలు వీరే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్:
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాకు రాబోతున్నాడు. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత రెండు రోజుల జీ 20 సదస్సులో పాల్గొంటాడని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బైడెన్‌కు టెస్టు చేయగా.. కరోనా నెగెటివ్ అని రిజల్ట్ వచ్చింది.
చైనా ప్రీమియర్ లి ఖియాంగ్:
చైనీస్ ప్రీమియర్ (స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్) లి ఖియాంగ్ సారథ్యంలో చైనా ప్రతినిధులు జీ 20 సదస్సుకు రాబోతున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరుగుతున్న జీ 20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రావడం లేదు. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి జీ 20 సదస్సుకు ఆయన ఎన్నడూ గైర్హాజరుకాలేదు.
Also Read: G20 2023: జీ20 అంటే ఏమిటి? దాని ఎజెండా ఏమిటి? దౌత్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది?
బ్రిటన్ పీఎం రిషి సునాక్:
బ్రిటన్ పీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రిషి సునాక్ తొలిసారి బ్రిటన్ పీఎం హోదాలో భారత్‌కు రాబోతున్నారు.
ఆస్ట్రేలియా పీఎం ఆంటనీ ఆల్బనీస్:
జీ 20(G20 2023) సదస్సుకు రాబోతున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బనీస్ కన్ఫమ్ చేశారు. ఆయన భారత్ సహా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మూడు దేశాల పర్యటనలో ఉంటారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో:
ఏషియన్ సదస్సుకు హాజరు కావడానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ముందుగా ఇండోనేషియాకు వెళ్లుతారు. ఆ తర్వాత జీ 20 సదస్సుకు ఢిల్లీకి వస్తారు.
జర్మన్ చాన్సిలర్ ఒలాఫ్ షోల్జ్:
జర్మన్ చాన్సిలర్ ఒలాఫ్ షోల్జ్ ఢిల్లీకి రాబోతున్నట్టు కన్ఫామ్ చేశారు. రష్యా, చైనా అధ్యక్షులు రాకున్నప్పటికీ జీ 20 సదస్సు ఎంతో ముఖ్యమైనదని ఆయన జర్మన రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
జపాన్ పీఎం ఫుమియో కిషిదా:
కిషిదా ఢిల్లీకి రాబోతున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆయన విమర్శలు చేసే అవకాశం ఉన్నది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యో:
యూన్ సుక్ యో ఢిల్లీకి రాబోతున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టు చర్యలను, అణు బెదిరింపులను గ్లోబల్ లీడర్ల ముందు ఎండగట్టనున్నారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్:
మ్యాక్రన్ ఇండియాకు రానున్నారు. ప్రధాని మోడీతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్యలు జరపనున్నారు.
Also Read: జీ20 సమ్మిట్ కు హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్రపతి విందు: ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్:
మొహమ్మద్ బిన్ సల్మాన్ జీ 20 సదస్సుకు వస్తారు. అయితే.. అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా:
రమఫోసా జీ 20కి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు అన్ని విధాల సహకారం అందించనున్నారు.
టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్:
ఎర్డోగన్ జీ 20కి హాజరవుతారు. పర్యావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడనున్నారు.
అర్జెంటినా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్:
ఢిల్లీలో నిర్వహిస్తున్న జీ 20 సదస్సుకు రాబోతున్నట్టు ఫెర్నాండ్ కన్ఫామ్ చేశారు.
నైజీరియా అధ్యక్షుడు బోలా తినుబు:
జీ 20 సదస్సుకు బోలా తినుబు హాజరవుతారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రానున్నారు.
ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఢిల్లీలో నిర్వహించే జీ 20 సదస్సుకు రావడం లేదు. యూరోపియన్ నేతలు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వొన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మికేల్‌లు వారి రాకపై ఇంకా కన్ఫమేషన్ ఇవ్వలేదు. మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రిస్ మానెల్ లోపెన్ ఇబ్రడార్ కూడా రావడం లేదు.
కాగా, ఇటలీ అధ్యక్షుడు జార్జియా మెలోని, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోల హాజరపై అనిశ్చితి ఉన్నది. ఇంకా ఖరారు కాలేదు.
