భారత రాష్ట్రపతి స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో జీ 20 సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లడం చర్చకు దారి తీసింది.
న్యూఢిల్లీ: ఈ వీకేండ్ లో న్యూఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలకు అధికారికంగా పంపిన ఆహ్వానంలో భారత రాష్ట్రపతి స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ ప్రతినిధులకు ఈ నెల 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందును ఇస్తున్నారు.ఈ మేరకు రాష్ట్రపతి ఆహ్వానాలు పంపారు. భారత రాష్ట్రపతి కి బదులుగా భారత్ అధ్యక్షుడు అనే పేరుతో ఆహ్వానాలు వెళ్లాయి.ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపడం ఇదే తొలిసారిగా అధికారులు చెబుతున్నారు.
భారత్ అనే పదం కూడ రాజ్యాంగంలో ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. భారతదేశం అంటే భారత్, రాష్ట్రాల యూనియన్ గా ఉండాలని ఆర్టికల్ 1 చెబుతుంది.జీ20 సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులకు అందించే బుక్ లెట్లో భారత్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ విషయమై అసోం సీఎం హిమంత బిస్వాశర్మ స్పందించారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్ గొప్ప మార్పు అంటూ వ్యాఖ్యానించారు. అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ఈ విషయమై బీజేపీ నేతల నుండి స్వాగతం వచ్చింది. కానీ విపక్షాలు మాత్రం ఈ విషయమై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రపతి భవన్ భారత రాష్ట్రపతికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో జీ 20 సమావేశానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం పంపిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ చెప్పారు. ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్ కూడ దాడికి గురౌతుందని ఆయన ఆరోపించారు. రెండు రోజుల క్రితం భారతదేశానికి బదులుగా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నుండి సూచన వచ్చింది.
భారతదేశం అనే పదాన్ని ఉపయోగించడం మానేసి భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ఇంగ్లీస్ లో మాట్లాడే వారికి అర్ధమయ్యేందుకు భారతదేశాన్ని ఉపయోగిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్ అని రాయాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియా వర్సెస్ భారత్ అనే చర్చ ప్రారంభమైంది. పేరు మార్చుకోవడం ద్వారా పాపాల నుండి తప్పించుకొనేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఇండియా కూటమిపై గతంలోనే మోడీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ నెల 18 నుండి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తారా అనే చర్చ సాగుతుంది.ఈ సమావేశాల్లో తీర్మానాలు ఏమైనా చేపడుతారా అనే చర్చ కూడ లేకపోలేదు.
