రేపు మిజోరంలో పోలింగ్.. స్థానిక పార్టీల మధ్యే భీకర పోటీ? బీజేపీ ఉనికికి పరీక్ష!
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్‌పీఎం, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
గువహతి: ఈశాన్య రాష్ట్రం మిజోరంతోపాటు ఛత్తీస్‌గడ్ తొలి విడత పోలింగ్ రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మిజోరం రాజకీయ పరిస్థితులపై ఆసక్తి నెలకొంది. మిజోరంలో రెండు స్థానిక పార్టీలు ఎంఎన్ఎఫ్, జెడ్‌పీఎంల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమాను కనబరుస్తున్నది. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓ పరీక్ష అని విశ్లేషకులు చెబుతున్నారు. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలో ఎంఎన్ఎఫ్ ఉన్నది.
క్రిస్టియన్ మెజార్టీగా ఉండే ఈ రాష్ట్రంలో ఎన్నికల క్యాంపెయిన్ ఆదివారంతోనే ముగిసింది. చర్చీల్లో ప్రార్థనలతో క్యాంపెయిన్లు ముగిశాయి. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 18 మంది మహిళలు.
మణిపూర్ కల్లోలం నేపథ్యంలో తమ పార్టీ మిజో అనుకూలం కాబట్టి మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా ఎంఎన్ఎఫ్‌లో ఉన్నది. కొత్తగా ఆవిర్భవించిన జెడ్‌పీఎం మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. తాము రాష్ట్రంలో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతామని ఓటర్లకు చెబుతున్నది. మార్పు కోసం తమకు ఓటు వేయాలని ప్రచారం చేసింది. కాగా, 2018లో అధికారాన్ని ఎంఎన్ఎఫ్‌కు అప్పజెప్పిన కాంగ్రెస్ మళ్లీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మకంగా ఉన్నది.
Also Read: దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు.. రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల కామెంట్
ఎంఎన్ఎఫ్ పార్టీ పదేళ్ల తర్వాత పుంజుకుని 2018లో అధికారంలోకి వచ్చింది. 26 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్‌ను మూడో స్థానానికే పరిమితం చేసింది. 2018లో కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన జెడ్‌పీఎం క్యాండిడేట్లు ఏడుగురు గెలిచి ఆశ్చర్యపరిచారు.
ఈ సారి ఎంఎన్ఎఫ్, జెడ్‌పీఎం, కాంగ్రెస్‌లు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తున్నది. కాగా, బీజేపీ మాత్రం 23 సీట్లల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ సీట్లు రాబోవని, కాబట్టి, అంతిమంగా తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నది. కానీ, పరిశీలకులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మిజోరంలో 87 శాతం ప్రజలు క్రైస్తవులు. వారు బీజేపీని విశ్వసించే పరిస్థితిలో లేరని వివరిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జెడ్‌పీఎంల మధ్యే హోరాహోరీ పోటీ ఉంటుందని మిజోరం యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జే డౌంజెల్ అభిప్రాయపడ్డారు.
Also Read : విజయశాంతి పార్టీ మారడం కన్ఫామ్? స్టార్ క్యాంపెయినర్ల జాబితా లో దక్కని చోటు
కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈశాన్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే తొలి రాష్ట్రం మిజోరం అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మిజోరంలోని మెజార్టీ క్రిస్టియన్ మిజోలకు అపాయకరమైన పార్టీ అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. రాష్ట్రంలో పార్టీ ఎంట్రీకి ఎంఎన్ఎఫ్, జెడ్‌పీఎంలు సహకరిస్తాయని పేర్కొంది. అంతేకాదు, రాజస్తాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల హామీలను కాంగ్రెస్ ఈ రాష్ట్రం లోనూ ప్రకటించింది.