Asianet News TeluguAsianet News Telugu

దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు.. రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల కామెంట్

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే రేవంత్ రెడ్డిని దొంగ అని పేర్కొందని, దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని ముద్దుగా రేటెంత రెడ్డి అని కూడా పిలుచుకుంటారని పేర్కొన్నారు.
 

ys sharmila serious allegations against tpcc chief revanth reddy while supporting his party in telangana elections kms
Author
First Published Nov 6, 2023, 4:22 PM IST

హైదరాబాద్: వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు. ఆమె ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక వైపు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి మరో వైపు రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించినట్టూ అనే అనుమానాలు వస్తున్నాయి.

హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో విలేకరులతో ఆమె సోమవారం మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు కోదండరామ్ వద్దకు, సీపీఐ, సీపీఎంల వద్దకు వెళ్లి మద్దతు కోరారని, కానీ, అసలు అడగకముందే వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని, అలా మద్దతు ఇచ్చినా కాంగ్రెస్‌ నుంచి పెద్దగా స్పందన ఎందుకు రాలేదని ఓ విలేకరి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మరోసారి సీఎంగా కేసీఆర్ ఉండరాదని, మళ్లీ ప్రజలు బాధపడకూడదనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని, వారి నుంచి ప్రశంసలు ఆశించి కాదనీ అన్నారు. కాగా, రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించగా సీరియస్ కామెంట్లు చేశారు.

రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో నిందితుడని, దొంగ అని తీవ్రంగా మీరే విమర్శించారని, అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు? అని ప్రస్తావించగా.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నదని ఆమె అన్నారు. ఆ కేసు కొట్టేయాలని అప్రోచ్ అయితే.. కుదరదని, కేసు విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొందని, కాబట్టి, దొంగ అని తాను అనడం లేదని, సుప్రీంకోర్టే అన్నదని పేర్కొన్నారు. ఆయనను రేవంత్ రెడ్డి కాకుండా రేటెంత రెడ్డి అని కూడా కొందరు పిలుస్తారని అన్నారు. టికెట్లు అమ్ముకుంటున్నారనీ ఆరోపిస్తున్నారని తెలిపారు. కాబట్టి, తాను కాదు.. రేవంత్ రెడ్డిని దొంగ అని వేరేవారు పిలుస్తున్నారని కామెంట్ చేశారు. ప్రతిపార్టీలోనూ దొంగలు ఉంటారని, కానీ, ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని రేవంత్ రెడ్డిని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు.

Also Read: విజయశాంతి పార్టీ మారడం కన్ఫామ్? స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దక్కని చోటు

కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూనే రేవంత్ రెడ్డిపై షర్మిల ఎందుకు ఇంత సీరియస్ కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతున్నది. వైఎస్సార్టీపీని తెలంగాణ కాంగ్రెస్‌లో కలుపాలనే చర్చ జరిగింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్యవర్తిత్వంలో కాంగ్రెస్ అధిష్టానంతో షర్మిల చర్చలు చేశారు. కానీ, వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం కాకుండా రేవంత్ రెడ్డి వర్గం అడ్డుకోగలిగిందనే టాక్ ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డిపై ఆమె గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఆమెను తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టూ కథనాలు వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios