Today’s News Roundup 27th August 2025: ఇవ్వాల్టీ ప్రధానాంశాలు: 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సాదాబైనామాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, నేటీ నుంచి అమెరికా 50% సుంకం అమలు, సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం, అంపైర్ కాల్ నియమంపై సచిన్ కామెంట్స్.
Today’s News Roundup 27th August 2025:
30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు .. చర్చించే అంశాలివే..
Telangana Assembly Session: స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. సభకు ముందు, 29న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చర్చించిన అంశాలపై ఆమోదం ఇవ్వబడనుంది.
సభ ప్రారంభం రోజున జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం ప్రకటించనున్నారు. సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉపసభాపతి ఎన్నిక కూడా నిర్వహించబడుతుంది. అలాగే.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చలు జరపనుండగా, దీనిపై సమావేశాల్లో ప్రధానంగా సీహెచ్‌డీ అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణ రైతులకు ఊరట.. సాదాబైనామాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అడ్డంకి తొలిగింది. 2020లో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసి, దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిచ్చింది. భూభారతి చట్టంలో క్రమబద్ధీకరణ అంశాన్ని పొందుపరచడంతో కోర్టు సంతృప్తి చెందింది.
దీంతో రాష్ట్రంలోని దాదాపు 9.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రిజిస్ట్రేషన్ పత్రాలు లేని భూములను సాగు చేస్తున్న రైతులు ఊరట పొందుతున్నారు. ఈ తీర్పుపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాదాబైనామాల సమస్య పరిష్కారానికి భూభారతి చట్టమే మార్గం చూపిందని పేర్కొన్నారు.
నేటీ నుంచి 50% సుంకాల భారం.. భారత ఎగుమతులకు పెద్ద దెబ్బ
US Tariffs: భారతీయ వస్తువులపై అమెరికా భారీ దిగుమతి సుంకాలు విధించింది. ఆగస్టు 27 (బుధవారం) తెల్లవారుజామున 12.01 గంటల నుంచి భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై మొత్తం 50% సుంకాలు అమల్లోకి వస్తాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ముసాయిదా ఉత్తర్వులో పేర్కొంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇది శిక్షాత్మక చర్యగా తీసుకోవడమనీ, భారత్ ఇప్పటికే దీన్ని అన్యాయం, అసమంజసమైన నిర్ణయమని మండిపడింది.
భారత విదేశాంగశాఖ ప్రకటనలో రష్యా నుంచి చమురు దిగుమతి దేశ ప్రజల ప్రయోజనాలకై అవసరమని స్పష్టం చేసింది. ఫార్మా, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల రంగాలు ముఖ్యంగా ప్రభావితమవుతాయి. అయినప్పటికీ, భారత్ తన జాతీయ ప్రయోజనాలను రక్షిస్తూ, చమురు దిగుమతులు కొనసాగిస్తుందని ప్రకటించింది.
విశాఖలో రెండు యుద్ధ నౌకలు జాతికి అంకితం
భారత నావికాదళ శక్తి మరింత పెరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు విశాఖలో జరిగిన కార్యక్రమంలో INS ఉదయగిరి, INS హిమగిరి యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. ఇవి రెండూ ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్లు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL) ఉదయగిరిను, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) హిమగిరిను నిర్మించాయి.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ “బ్రహ్మోస్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు, టార్పెడోలు, ఆధునిక పోరాట నిర్వహణ వ్యవస్థలు అమర్చిన ఈ యుద్ధనౌకలు గేమ్ ఛేంజర్స్ అవుతాయి. ఇవి సముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడటంలో కీలకంగా ఉంటాయి” అన్నారు. ఇవి తూర్పు నౌకాదళంలో చేరి, హిందూ మహాసముద్రంలో భారత రక్షణ శక్తిని మరింత బలపరచనున్నాయి.
సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
సోషల్ మీడియాలో ప్రవర్తనను నియంత్రించే మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మార్గదర్శకాల ముసాయిదా న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (NBSA) తో సహకారంలో తయారుచేయాలని కోర్టు తెలిపింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ప్రకారం, “మార్గదర్శకాలు ఏకపక్షంగా కాకుండా, సమగ్రంగా ఉండాలి. హాస్యం జీవితంలో భాగమే కానీ, అది ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. సమాజ సున్నితత్వాన్ని గౌరవించేలా నియమాలు ఉండాలి” అని సూచించారు.
ఈ కేసు నేపథ్యం: ఆన్‌లైన్‌లో చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, వికలాంగులపై అవమానకర కంటెంట్ సంబంధించి పలువురు కామెడీయన్లు, పాడ్‌కాస్టర్‌లపై వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్‌లో జరగనుంది. ఆ సమయానికి కేంద్రం, NBSA సంప్రదింపులతో రూపొందించిన మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలి.
ఆ రూల్ ను తొలగించండి: సచిన్ టెండూల్కర్ డిమాండ్
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) లోని అంపైర్ కాల్ నియమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంకా మానవ తప్పిదాలను అంగీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రెడ్డిట్‌లో నిర్వహించిన Ask Me Anything (AMA) సెషన్‌లో సచిన్ మాట్లాడుతూ “ఆటగాళ్లు రివ్యూ కోరినప్పుడు మళ్లీ అదే అంపైర్ నిర్ణయంపైనే ఆధారపడటం ఎందుకు? టెక్నాలజీ ఉన్నప్పుడు స్పష్టమైన తీర్పును ఇవ్వాల్సిందే”అని అన్నారు. మానవ అంపైర్లలో తప్పిదాలు సహజమే అయినా, టెక్నాలజీ ఎప్పుడూ స్థిరమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి, దానిపైనే ఆధారపడాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి.
