Today’s News Roundup (18th August 2025): ఇవ్వాళ్టి ప్రధాన వార్తల్లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, మేడ్చల్ సరోగసి కేసులో సంచలన విషయాలు , జూనియర్ ఎన్టీఆర్- టీడీపీ ఎమ్మెల్యే ఫేక్ ఆడియో వివాదం, సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ పూర్తి.
Today’s News Roundup (18th August 2025): ఇవ్వాళ్టి ప్రధాన వార్తలు
జాతీయం - "సీపీ రాధాకృష్ణన్: ఎన్డీఏ కొత్త ఉపరాష్ట్రపతి అభ్యర్థి!"
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆగస్టు 17న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇచ్చారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన తమిళనాడుకు చెందినవాడు. రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నుండి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చిలో రాజీనామా చేయడంతో, రాధాకృష్ణన్ 2024 జులై 31 వరకు అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 21న నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎన్డీఏ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుంది.
వ్యాపారం- దీపావళికి డబుల్ ధమాకా: కార్లు, బైకులపై GST రేట్లు భారీగా తగ్గనున్నాయి!
రాబోయే దీపావళి పండుగ వరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేయబోతుంది. ఈ మార్పు వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీలో మార్పులు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతంలో చిన్న కార్లకు 28% GST, అదనంగా 1–3% చిన్న సెస్సు విధించబడుతుంది. SUV వాహనాలకు GST, సెస్సు కలిపి 50% వరకు పన్ను రావాల్సి ఉంటుంది. కొత్త విధానం ద్వారా ఈ పన్నులు తగ్గనున్నాయనీ, వాహనాల కొనుగోలు మరింత సులభం కానున్నట్టు తెలుస్తోంది.
అంతేకాక, కొత్త GST విధానంలో వస్తువులను రెండు వర్గాల్లో విభజిస్తారు: మెరిట్ – 5% వరకు GST, ప్రామాణిక – 18% GST. ఈ కొత్త విధానం కింద, చిన్న కార్లు, ఎంట్రీ-లెవల్ మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ GSTతో మార్కెట్‌లో లభించవచ్చు. లగ్జరీ వాహనాలపై కూడా GST రేట్లు సమానంగా ఉంటాయని అంచనా. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ పన్ను తగ్గింపులు భారత ఆటోమోటివ్ పరిశ్రమకు లాభదాయకంగా ఉంటాయి. తయారీ, విడి భాగాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
తెలంగాణ- బ్యాచ్‌లర్స్ కు రూమ్ అద్దెకు ఇచ్చి, వీర్యం సేకరణ.. మేడ్చల్ సరోగసి కేసులో బయటపడ్డ నిజాలు!
తెలంగాణలో మరో అక్రమ సరోగసి స్కామ్ బయటపడింది. మేడ్చల్‌లో అక్రమంగా సరోగసి నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసుల విచారణ ప్రకారం.. లక్ష్మిరెడ్డి అనే మహిళ తన ఇంటి మొదటి అంతస్తును బ్యాచ్‌లర్స్‌కు అద్దెకు ఇచ్చి, వారి నుంచి వీర్యాన్ని అక్రమంగా సేకరించినట్టు తెలుస్తోంది. సరోగసికి కావలసిన మహిళలను ఏర్పాటు చేయడం, ఆండాలను సేకరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఆమె చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో లక్ష్మిరెడ్డి కుమారుడు సురేందర్ రెడ్డి కూడా పాలుపంచుకున్నాడు. పోలీసులు ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలతో సరోగసి జరిగిందని ఆధారాలు సేకరించారు. లక్ష్మిరెడ్డి ఒక డైరీలో సరోగసికి అంగీకరించిన మహిళల వివరాలు, ఇచ్చిన డబ్బుల వివరాలను కూడా నమోదు చేసినట్లు తేలింది. పోలీసులు ఈ కేసులో ఆరు ఆసుపత్రులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ - జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన.. టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణ..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఆడియోలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ‘వార్ 2’ స్పెషల్ షోకు అనుమతి అడిగిన అభిమానిపై అసభ్య పదజాలంతో తిట్టినట్టు తెలుస్తోంది. వార్ 2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటానంటూ హెచ్చరిస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ ఆడియో నెట్టింట భారీ చర్చకు దారితీసింది. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించి, ఎమ్మెల్యే ప్రత్యక్షంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో వైరల్ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. ఆ ఆడియో తనది కాకపోయిందని ఖండించారు. అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు క్షమాపణలు చెబుతున్నానని, దీనికి రాజకీయ కుట్ర కారణమని పేర్కొన్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కుటుంబాన్ని గౌరవిస్తున్నారని, తన పేరు, ప్రతిష్టను కించపరచడానికి ఫేక్ ఆడియోని వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఈ వివాదం తర్వాత అభిమానుల ఆగ్రహం చల్లారుతుందా లేదా అనేది చూడవలసిన పరిస్థితి.
స్పోర్ట్స్ - టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఫిట్ టెస్ట్ పాసైన సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025కు ముందు టీం టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయ్యారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) సూర్యకుమార్ ఫిట్‌నెస్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ నెలలో జర్మనీలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తర్వాత, సూర్యకుమార్ ఆసియా కప్‌లో టీం ఇండియాకు కెప్టెన్‌గా సిద్ధంగా ఉన్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇటీవల బెంగళూరులో పునరావాస కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు. త్వరలో సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ జట్టులో ఎంపిక సమావేశంలో పాల్గొననున్నారు. టీం ఇండియా సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది.
గత సంవత్సరం సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 717 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ తర్వాత ఒక సీజన్‌లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. IPL 2025లో సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.
