బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
న్యూఢిల్లీ :పేదలకు సామాజిక న్యాయం చేయడమే బీజేపీ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 44వ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారంనాడు వర్చువల్ గా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. సామాజిక న్యాయం బీజేపీ రాజకీయ నినాదం కాదన్నారు. సామాజిక న్యాయం పేరుతో చాలా పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ ఇతర పార్టీల అడ్రస్ ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ పెద్ద పెద్ద కలలను కంటుందన్నారు. ఆ కలలను సాకారం చేయడం కోసం పనిచేస్తుందని మోడీ చెప్పారు.
బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలున్నాయన్నారు. హనుమంతుడి మాదిరే బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. హనుమంతుడు చేయలేనిది ఏదీ లేదన్నారు. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా చేయలేనిది ఏమీ లేదన్నారు.
పార్టీ కార్యకర్తలు ఎంతో నిస్వార్థంతో పనిచేస్తారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు దేశమే అన్నింటికంటే మిన్నా అని మోడీ చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం ఓ మాతృకగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బలోపేతం కోసం బీజేపీ కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని మోడీ చెప్పారు. బీజేపీ అంటే విశ్వాసానికి ప్రతిరూపంగా మోడీ పేర్కొన్నారు.
2014లో జరిగింది అధికార మార్పిడి కాదన్నారు. దేశ ప్రగతికి పడిన అడుగుగా మోడీ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు అధికారం తమ జన్మహక్కుగా భావిస్తున్నాయని మోడీ విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమానికి కృషి చేసినట్టుగా మోడీ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా గురించి చెబితే అపోహలు సృష్టించారని మోడీ చెప్పారు. బీజేపీని హేళన చేసినవాళ్లకు కాలమే సమాధానం చెప్పిందని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించినట్టుగా మోడీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కొత్త చరిత్ర సృష్టించినట్టుగా మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
బీజేపీ రక్షణ కోసం ప్రజలు అండగా ఉన్నారని మోడీ చెప్పారు. అస్థిత్వం కోసం కొన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని ఆయన విపక్షాలపై విమర్శలు చేశారు. ఎవరేమన్నా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమన్నారు.
