Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి..కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం.. సమ్మె విరమించిన ట్యాంకర్లు

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో మేడారం స్పెషల్ బస్సులు.. కానీ, మహిళలకూ చార్జీలు!, కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు, సంక్రాంతి కానుక.. పండుగకు 32 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే, చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ట్యాంకర్ డైవర్లు, నేడు కేప్‌టౌన్‌లో రెండో టెస్ట్ .. టీమిండియా నెగ్గేనా..? వంటి వార్తల సమాహారం.

today top stories, top 10 telugu news for january 3rd 2024 andhra prades telangana updates headlines krj
Author
First Published Jan 3, 2024, 6:15 AM IST

Today Top Stories: మేడారం స్పెషల్ బస్సులు..మహిళలకూ చార్జీలు!

మేడారం జాతరకు స్పెషల్ బస్సుల్లో మహిళలకూ చార్జీలు వేయనున్నట్టు తెలుస్తున్నది. మేడారం జాతరకు స్పెషల్ బస్సులను వేయాలని ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. మహిళలకు కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తొట్టతొలిగా అమలు చేసిన హామీ మహాలక్ష్మీ పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కోసం ఆర్టీసీకి నెలకు సుమారు రూ. 250 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఖజానాలో డబ్బులు నిండుకుని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పగా మారిందని ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది.  ఇంతలోనే మేడారం జాతర దగ్గరకు వస్తున్నది. మేడారం జాతరలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తే మరింత దెబ్బ తినే అవకాశముందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.  అందుకే ఈ మేడారం జాతరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో స్పెషల్ బస్సులను నడపాలని రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.  

కేసీఆర్ ను కాపాడుతున్నది కిషన్ రెడ్డి - మంత్రి పొన్నం ప్రభాకర్

ponnam prabhakar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బినామీ అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇంత వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడిగడ్డ పై ఎందుకు విచారణ జరపలేదని అన్నారు. మేడిగడ్డపై కేంద్రం సీబీఐ విచారణ జరపకపోవడాన్ని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీబీఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి కోరుతున్నారని, దీనిని బట్టి చూస్తే కేసీఆర్ ను ఆయన కాపాడుతున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అని విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ  అధినేత వై.ఎస్. షర్మిల  తన పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. మంగళవారంనాడు  వైఎస్ఆర్‌టీపీ ముఖ్య నేతలతో  వై.ఎస్. షర్మిల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం గురించి చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలో  వైఎస్ఆర్‌టీపీ నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని  షర్మిల పార్టీ నేతలకు  తెలిపారు. ఈ నెల 4వ తేదీన వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో  వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని వై.ఎస్. షర్మిలకు  కాంగ్రెస్ నాయకత్వం కట్టబెట్టే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున  వై.ఎస్. షర్మిల నిర్వహించనున్నారు. 

సీఎం జగన్‌‌తో వైఎస్ షర్మిల భేటీ..

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. బుధవారం  కుటుంబ సమేతంగా కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు షర్మిల. రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసంలో జగన్‌తో ఆమె భేటీ అవుతారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందించనున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు . 

 సంక్రాంతి కానుక.. పండుగకు 32 ప్రత్యేక రైళ్లు

Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.పండుగ సందర్భంగా సొంతూళ్ల‌కు చేరుకోవాలనుకునే వారి కోసం  జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32  ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ , బ్రహ్మపూర్ - వికారాబాద్, విశాఖపట్నం - కర్నూలు సిటీ, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ టౌన్, సికింద్రాబాద్ - నర్సాపూర్ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

27 మందితో వైసీపీ రెండో జాబితా..

Ysrcp Incharges Second List : పలు చేర్పులు.. మార్పుల తర్వత వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ల రెండో జాబితా ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా మొత్తం 27 మందితో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల రెండో జాబితాను విడుదల చేసింది.ఈ  రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సామాజిక సమీకరణాలతో రెండో జాబితా రూపొందించినట్లు తెలిపారు. రెండో జాబితాతో పలువురు ప్రముఖ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అదే తరుణంలో పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జ్ ల బాధ్యతలు అప్పగించారు. రెండో జాబితాలో ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. 

వైసీపీకి దాడి వీరభద్రరావు  రాజీనామా

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టుగా ఏకవ్యాఖ్య లేఖ రాశారు. ఈ లేఖను సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. దీనికంటే ముందు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు. రాజీనామా లేఖలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు పేరును ప్రస్తావించలేదు దాడి వీరభద్ర రావు. ఈ లేఖ కాపీలను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లకు కూడా పంపించారు. 

చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ట్యాంకర్ డైవర్లు
 
దేశవ్యాప్తంగా నూతన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం దిగి వచ్చింది.  ట్రాన్స్‌పోర్టు సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టం అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా కేంద్ర ప్రభుత్వంతో కీలక సమావేశం తర్వాత.. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (AIMTC) మంగళవారం నాడు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపింది.  హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను త్వరలో ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. భారతీయ న్యాయ సంహితపై తాము సమావేశమై చర్చించామనీ,  అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయనీ, కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదనీ,  AIMTCతో సంప్రదించిన తర్వాత మాత్రమే అమలు చేయబడతాయని ట్రక్కర్స్ ఛైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ తెలిపారు. త్వరలో సమ్మె విరమిస్తామని, డ్రైవర్లు విధుల్లో చేరాలని కోరినట్లు తెలిపారు. 

 నేడు కేప్‌టౌన్‌లో రెండో టెస్ట్ .. టీమిండియా నెగ్గేనా..?


IND vs SA: టీ20, వ‌న్డేల‌లో అద‌ర‌గొట్టి.. టెస్టుల్లోనూ చరిత్ర సృష్టించేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోర‌ ఓటమిని చవిచూసింది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోని టీమిండియా బుధవారం నుంచి కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నుంచి మ‌రో గ‌ట్టి స‌వాలు ఎదుర్కొనుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే భారత్ రెండో మ్యాచ్ లో తప్పక గెలవాలి. అయితే స‌ఫారీ పేసర్లను ఎదుర్కొవ‌డ‌మే ప్ర‌స్తుతం భార‌త్ ముందున్న అతిపెద్ద సవాలు.


చివరి మ్యాచ్‌లోనూ నిరాశే.. ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తు ..

INDW vs AUSW, 3rd WODI :మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మహిళల జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 32.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌వుమెన్లు చేతులెత్తేశారు.

స్మృతి మంథాన 29, జెమ్మీయా రోడ్రీగ్స్ 25, దీప్తి శర్మ 25 పరుగులు మాత్రమే చేయగలిగారు. భీకర ఫాంలో వున్న రిచా ఘోష్ 19, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 3, అమన్‌జోత్ కౌర్ 3, పూజా వస్త్రాకర్ 14 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా వార్హెమ్ 3, మేఘన్ స్కాచ్ , ఆలనా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ వైట్‌వాష్ అయ్యింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios