ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో వన్డే లో టాపార్డర్ విఫలమైనా ఆతిథ్య జట్టును టెయిలెండర్లు ఆదుకున్నారు. ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. భారత పేస్ త్రయంలో షమీ, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ లు ఫర్వాలేదనిపించారు.
Telugu News Live : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
ఇంగ్లాండ్‌తో రెండో వన్డే : టీమిండియా లక్ష్యం 247
ఏపీలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం తెరదించింది. ఈ మేరకు వారి వేతనాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెరగనుంది. ప్రధాన డిమాండ్ నెరవేర్చినందున రేపటి నుంచి విధులకు హాజరవ్వాలని మున్సిపల్ కార్మికులకు మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజపక్సే రాజీనామా
శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్ కు చేరుకున్న అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్ మహీందా అభియవర్ధినేకు పంపినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
రాజకీయ పార్టీల విరాళాలపై కోవిడ్ ఎఫెక్ట్
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే రాజకీయ పార్టీలపైనా చూపింది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ గణాంకాలను వెల్లడించింది. కరోనా కారణంగా జాతీయ పార్టీల విరాళాలు సగానికి సగం పడిపోయినట్లు ఏడీఆర్ తెలిపింది. మొత్తంగా 41.49 శాతం తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది.
గోదావరి ఉగ్రరూపం.. భద్రాద్రి వంతెనపై రాకపోకల నిలిపివేత
గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపు దాల్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానికంగా గోదావరి నదిపై వున్న వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఈ కారణంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాద్రి రామయ్యను ప్రార్ధించినట్లు తెలిపారు.
భూపాల్‌పల్లి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పోలీస్ స్టేషన్
భూపాల్‌పల్లి జిల్లాలో పలిమెల పోలీస్ స్టేషన్ గోదావరి వరదలో చిక్కుకుపోయింది. 70 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, 20 మంది కానిస్టేబుళ్లు జలదిగ్భంధంలో ఇరుక్కుపోయారు. పై అధికారులకు సమాచారం అందడంతో వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో రానున్న ఐదుగంటల్లో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు హైఅలర్డ్
తెలంగాణ రాష్ట్రానికి రానున్న ఐదుగంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాల ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని... ఆయా జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు...ఈ నాలుగురోజులు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
భారీ వర్షాల కారణంగా ఇవాళ్టి (గురువారం) నుండి నాలుగురోజుల పాటు పలు ఎంఎంటిఎస్ సర్వీసులకు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటిచింది.
వెస్టిండిస్ తో టీ20 సీరిస్... టీమిండియా జట్టిదే..
వెస్టిండిస్ తో జరగనున్న టీ20 సీరిస్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ లో టిమిండియా విండిస్ తో తలపడనుంది.
మహారాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన షిండే సర్కార్
మహారాష్ట్ర ప్రజలకు షెండే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గిస్తూ నూతన సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయం తీసకున్నారు. లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 3 రూపాయలు తగ్గించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
వరుణ దేవా... ఇక శాంతించవా..: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రి తలసాని యాగం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులువకంలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. అనేక జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరుకుంది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా చూడాలని... వర్షాల తగ్గాలని కోరుకుంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక యాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వరణ శాంతి యాగం నిర్వహించడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కు కరోనా
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరి క్వారంటైన్ లోకి వెళ్లారు.
మాల్దీవులు నుండి సింగపూర్ కు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ పరార్
శ్రీలంకలో ఆందోళనల నేపథ్యంలో దేశంవిడిచి మాల్దీవుల్లో ఆశ్రయం పొందిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సింగపూర్ కు తాజాగా పరారయ్యారు. ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ విమానంలో భార్యా పిల్లలతో కలిసి గొటబాయ మాల్దీవులు నుండి సింగపూర్ పయనమయ్యారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు
మహారాష్ట్రలో ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన మహావికాస్ అఘాడీ కూటమిలో రాష్ట్రపతి ఎన్నికలు చీలికను సృష్టించేలా కనిపిస్తోంది. శివసేన పార్టీ తాజాగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దీంతో ఎంవిఏ కూటమిలోంచి కాంగ్రెస్ బయటకు వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
ప్రయాణికులకు గమనిక... వరదలతో పలు రైల్వే సర్వీసులు నిలిపివేత
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తడంతో దక్షిణ మధ్య రైల్వే ఇవాళ (గురువారం) పలు 17 రైలు సర్వీసులను రద్దు చేసింది. నగరంలో నడిచే ఎంఎంటీఎస్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
భారత్ లో మళ్లీ 20వేలు దాటికి కరోనా కేసులు...
దేశంలో మళ్లీ కరోనా మెల్లిగా విజృంభిస్తోంది. తాజాగా మరోసారి కేసుల సంఖ్య 20వేలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,139 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పటికే కరోనతో బాధపడుతున్న 38మంది మృతిచెందారు.
చుట్టుముట్టిన మహోగ్ర గోదావరి.. జలదిగ్భందంలో భద్రచలం
గోదావరి నదిలోకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గోదవరిలో నీటిమట్టం 60 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం జలదిగ్భందంలో మునిగిపోయింది. మూడువైపుల నుండి భద్రాచలంకు రాకపోకలు నిలిచిపోగా కేవలం కొత్తగూడెం వైపునుండి మాత్రమే వెళ్లడానికి అవకాశముంది. నదిలో నీటిమట్టం మరింత పెరిగితే ఆ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశాలున్నాయి.
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం...
ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురవడంతో వరద నీటితో గోదావరం మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 58.50 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరిలో ప్రవాహం మరింత పెరిగి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.