విపక్షాల ఐక్యతకు టీఎంసీ షాక్ ఇచ్చింది. బెంగాల్‌లో సీపీఎం పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తే.. ఆ పార్టీ తమ నుంచి మద్దతును ఆశించరాదని స్పష్టం చేసింది. ఈ నెల 23న పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 Lok Sabha Elections: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. విపక్షాల ఐక్య కూటమికి ఉన్న అడ్డంకులను పరిష్కరించుకోవడానికి, ఒక అండస్టాండింగ్‌కు రావడానికి, కూటమికి భూమిక తయారు చేసుకోవడానికి ఈ నెల 23న పాట్నాలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ చొరవతో ఈ సమావేశం కార్యరూపం దాలుస్తున్నది. విపక్షాల కూటమి సాధ్యమే అనే భావన బలపడుతున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పార్టీతో కాంగ్రెస్ జత కడితే.. లోక్ సభ ఎన్నికల్లో తమ సహకారాన్ని హస్తం పార్టీ ఆశించవద్దని కరాఖండిగా తేల్చేశారు. కాక్ ద్వీప్‌లో ఓ సభలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు సీపీఎం అతిపెద్ద మిత్రపక్షం అని అన్నారు. అవి బీజేపీకి మరింత పెద్ద మిత్రపక్షాలు అని ఆరోపణలు గుప్పించారు. వాళ్లే పార్లమెంటు ఎన్నికల్లో టీఎంసీ సహకారం కోరుతున్నారని పేర్కొన్నారు.
తాము ఇప్పటికీ బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నామని అన్నారు. ‘కానీ, ఒకటి గుర్తుంచుకోండి, బెంగాల్‌లో మీరు సీపీఎం పార్టీకి మద్దతు ఇస్తే.. ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో మా మద్దతును ఆశించకండి’ అని చెప్పారు.
పాట్నాలో ఈ నెల 23న జరిగే ప్రతిపక్షాల సమావేశానికి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు భేటీ కాబోతున్నారు. వీరితోపాటు ప్రతిపక్ష సీఎంలు, ఇతర విపక్ష నేతలు హాజరు అవుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగతా 2024 ఎన్నికల కోసం ఒక ప్రతిపక్ష కూటమికి ఈ భేటీలో మంతనాలు జరపనున్నారు.
Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి అఖిలేశ్ యాదవ్ ఫార్ములా.. విపక్ష కూటమిపైనా వ్యాఖ్యలు
బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగిన తరుణంలో ఈ సమావేశం జరగబోతున్నది. ఈ పంచాయతీ ఎన్నికలు ముక్కోణంలో జరిగాయి. టీఎంసీ, బీజేపీ ఒకవైపైతే.. కాంగ్రెస్, సీపీఎంలు పరస్పర సహకారంతో పోటీ చేశాయి. సీపీఎం 48,646 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ 17,750 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ కంటే అధికంగా అంటే 56,321 మంది అభ్యర్థులను పోటీకి నిలిపాయి.
సాగర్దిగి బైపోల్ ఎన్నికలో గెలిచిన బైరాన్ బిశ్వాస్ లెఫ్ట్, కాంగ్రెస్‌ల అభ్యర్థి. కానీ, గెలిచిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ ఘటన కూడా కాంగ్రెస్, టీఎంసీల మధ్య దూరం పెంచింది.
