Goa Assembly election 2022: ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న గోవాలో ఉన్న తమ పార్టీ కార్యాల‌యంపై దాడి చేశార‌నీ ఆరోపించిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి  ఫిర్యాదు చేసింది.  

Goa Assembly election 2022: ఫిబ్ర‌వ‌రిలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. గోవాలోనూ అన్ని ప్ర‌ధాన పార్టీలు అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. అయితే, సారి గోవా ఎన్నిక‌ల్లో (Goa Assembly election 2022) బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress) సైతం బ‌రిలోకి దిగింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు మ‌మ‌తా బెన‌ర్జీ గోవాలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. 

అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో గోవాలోని త‌మ పార్టీ కార్యాల‌యాన్ని ధ్వంసం చేశార‌ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ప‌నాజీ కార్యాల‌యం వ‌ద్ద బ్యాన‌ర్లు, ఫ్లెక్సీ బోర్డుల‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తొల‌గించి వేధింపుల‌కు పాల్పడుతున్నార‌ని పేర్కొంది. ఇదే విష‌యంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC) కు తృణ‌మూల్ కాంగ్రెస్ శ‌నివారం నాడు ఫిర్యాదు చేసింది. పోలీసుల‌తో కూడిన ఒక టీమ్ త‌మ పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని ఆరోపించింది. అలాగే, గోవాలోని తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress) కార్యాల‌యాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుద‌ల చేసింది. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీని కోరింది. కాగా, మొద‌టి సారి గోవా ఎన్నిక‌ల బ‌రిలో దిగుతోంది తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress). అక్క‌డ అధికారం ద‌క్కించుకోవాల‌ని స్థానిక పార్టీల‌తో పొత్తులు సైతం పెట్టుకుంటున్న‌ది. 

ఈ క్ర‌మంలోనే గోవాలో ఇదివ‌ర‌కు బీజేపీతో జ‌త‌క‌ట్టిన మహారాష్ట్రవాదీ గోవాన్ పార్టీతో తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పొత్తు పెట్టుకుంది. గోవా ఎన్నికల్లో ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు కోసం కూడా ప్ర‌య‌త్నించింది. అయితే, ఇది ఫ‌లించ‌లేదు. దీంతో దూకుడు పెంచిన తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress).. తాజాగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల రెండో జాబితాను కూడా విడుద‌ల చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18 స్థానాల్లో ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, లుయిజిన్హో ఫలేరో, నఫీసా అలీ సోధీ, లియాండర్ పేస్, కీర్తి ఆజాద్‌ల నేతృత్వంలో గోవా అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీ (Trinamool Congress) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

కాగా, గోవాలో (Goa) మొత్తం 40 స్థానాలుకు ఫిబ్రవరి 14న పోలింగ్ (Goa Assembly election 2022) జరగనుంది. అలాగే, గోవాతో పాటు ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 117 నియోజకవర్గాలున్న పంజాబ్‌లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. 60 స్థానాలున్న మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.