ముంబయి టిస్ కాలేజీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్.. యాజమాన్యం హెచ్చరికలు బేఖాతరు
ముంబయిలోని టిస్ కాలేజీలో బీబీసీ డాక్యుమెంటరీని విద్యార్థులు వీక్షించారు. ఎవరికి వారు తమ ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లలో ఇండియా: ది మోడీ కొశ్చన్ డాక్యుమెంటరీని చూశారు. యాజమాన్యం హెచ్చరికలను బేఖాతరు చేశారు.

ముంబయి: మహారాష్ట్రలోని ప్రముఖ కాలేజీ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో యాజమాన్యం హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేశారు. టిస్‌లో కొందరు విద్యార్థుల సమూహం ఒక దగ్గరకు చేరి బీబీసీ డాక్యుమెంటరీని వారి వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లలో వీక్షించారు. బ్రిటన్‌కు చెందిన బీబీసీ.. గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీ పై ఓ డాక్యు సిరీస్ తీసింది. రెండు పార్టులతో వచ్చిన ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ఉన్నదని, ఒక ప్రాపగాండ పీస్ అని కొట్టిపారేసింది. అంతేకాదు, ఈ డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సైట్‌లు యూట్యూబ్, ట్విట్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
ముంబయిలోని టిస్ క్యాంప్ సహా దాని బ్రాంచీల్లోనూ మాస్ ఈవెంట్ నిర్వహించకూడదని విద్యార్థులకు అడ్వైజరీలు విడుదల చేసింది. ఈ అడ్వైజరీని పాటించకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసింది. బీబీసీ స్క్రీనింగ్ చేయడం అంటే విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నమే అని వార్నింగ్ ఇచ్చింది.
క్యాంపస్ వెలుపల ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు నిరసనలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఒక చోట గుమిగూడవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొందరు వెళ్లిపోయారు.
కాగా, ముంబయి బీజేపీ యూనిట్ చీఫ్ ఆశిశ్ షెలార ట్వీట్ చేస్తూ పోలీసులు వెంటనే ఈ స్క్రీనింగ్‌ను బ్యాన్ చేయాలని లేదంటే తాము తీసుకోవాల్సిన వైఖరిని అవలంభించి తీరుతామని హెచ్చరించారు.
బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ పై టిస్ స్టూడెంట్ యూనియన్ లీడర్ ప్రతీక్ పర్మీ స్పందించారు. తమ విద్యార్థి సంఘం బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కు ఎలాంటి ప్లానింగ్ చేయలేదని వివరించారు. ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్ డాక్యు సిరీస్ ఆర్గనైజ్ చేస్తామని పిలుపు ఇచ్చినట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్ం సెన్సార్షిప్ విధిస్తున్నదని, వాస్తవాలను మరుగున పరుస్తున్నదని పేర్కొంటూ ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీల విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కు శుక్రవారం ప్లాన్ చేశారు. ఈ ప్లానింగ్ అమలుకు ముందే యూనివర్సిటీ అధికారుల సూచనల మేరకు పోలీసులు పలువురు విద్యార్థులను క్యాంపస్ నుంచి బయటకు ఎత్తుకెళ్లారు. ఈ బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.