గడిచిన రెండేళ్లలో 13మంది మనుషుల ప్రాణాలు తీసిన ఆడపులి ‘అవని’ని ఎట్టకేలకు అంతమొందించారు. శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్ లో దానిని కాల్చి చంపేశారు. కాగా.. ఆ ఆడపులిని అంతమొందించిన వ్యక్తి హైదరాబాద్ షూటరే కావడం గమనార్హం.

దానిని కాల్చిచంపేందుకు గత సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. దాని జాడ కనుగొనేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నాలే చేశారు.

దాదాపు మూడు నెలలపాటు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దాని జాడ కనుగొన్నారు. అవ్ని తిరిగే ప్రాంతాల్లో ట్రాప్ కెమేరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా శిక్షణ పొందిన స్నిఫ్షర్ డాగ్స్ ని సైతం పులి ఆచూకీ కనుగొనేందుకు ఉపయోగించారు.

చివరకు మహారాష్ట్రలోని యవత్మల్ దానిని హైదరాబాద్ షూటర్ కాల్చి చంపేశాడు. ఈ ఆడపులికి మరో రెండు పులి పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటిని మాత్రం సురక్షితంగానే వదిలేశారు.  ఈ అవని పులి కూడా మనుషులను అమానుషంగా చంపి తినేస్తుందనే కారణంతోనే దీనిని కాల్చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 

కాగా.. గత రాత్రి చంపేసిన ఈ అవ్ని పులి కళేబరానికి నాగ్ పూర్ లోని గోరేవాడ రెస్క్యూ సెంటరులో పోస్టుమార్టం నిర్వహించారు.