మాజీ ముఖ్యమంత్రి జయలలిత సహాయకురాలు శశికళ జైలు నుంచి బైటికొచ్చాక తమిళనాడులోని ఎఐఎడిఎంకె-బిజెపి కూటమిలో భాగమవుతుందని తుగల్క్ ఎడిటర్ ఎస్ గురుమూర్తి వ్యాఖ్యానించారు. ఎందుకంటే డిఎంకెను ఓడించడమే ప్రథాన లక్ష్యంగా ఎఐఎడిఎంకె-బిజెపి కూటమిగా ఏర్పడినప్పుడు ముందున్న అన్ని అంశాలనూ కలుపుకుంటూ పోవాలని అన్నారు. 

తుగ్లక్ రీడర్స్ లో ఒకరు అడిగిన ప్రశ్నకు గురుమూర్తి అరుణ్ శౌరీ సమాధానం ఇస్తే.. మీ ఇల్లు తగలబడుతున్నప్పుడు గంగాజలం కోసం వేచి చూడడం కంటే, అందుబాటులో ఉన్న మురుగు నీటితోనైనా ఆర్పాలి.. అంటూ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ కూటమిలో చేరడాన్ని పోల్చుకొచ్చారు. 

జనవరి 27 న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదల అవుతుందనే ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ రాజకీయాల ధోరణుల మీద మాట్లాడుతూ హిందూమత ఓటు బ్యాంకు అనేది లోపభూయిష్టమైన లౌకికవాదంతో కూడుకుని,  మైనారిటీలను మెప్పించే ప్రొడక్ట్ గా మారిపోయింది అన్నారు. అంతేకాదు "హిందూ ప్రజలు అన్ని మతాలను అంగీకరించినప్పుడు ఒక్క మైనారిటీలకు మాత్రమే రక్షణ ఎందుకు?" అని ప్రశ్నించారు. 

ఇక తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఎంజీ రాంచంద్రన్ డిఎంకెకు కౌంటర్ గా ఏఐడిఎంకే స్థాపించకపోతే తమిళనాడులో జాతీయభావన, అధ్యాత్మిక భావన ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయేవని అన్నారు. ‘ఎంజీఆర్ ఈజ్ గ్రేట్’ అంటూ మాజీ ముఖ్యమంత్రి మరియు ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడిని గుర్తుచేసుకున్నారు. 

"డీఎంకే, ఏఐడిఎంకే రెండూ కరెప్టెడే, కానీ ఏఐడిఎంకే జాతీయతను అంగీకరిస్తుంది. డిఎంకే ఒక కుటుంబ పార్టీ, ఏఐడిఎంకే కాదు. డిఎంకే హిందూ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి, కానీ ఏఐడిఎంకే కాదు. డిఎంకె వేర్పాటువాది, మైనారిటీ రాజకీయాలను పోషిస్తుంది. అధికార దుర్వినియోగం, రౌడీయిజానికి డిఎంకె ప్రసిద్ధి చెందింది, అయితే ఇది ఎఐఎడిఎంకెలో తక్కువగా ఉంది ”అని తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన అన్నారు.

డిఎంకె గురించి మాట్లాడేటప్పుడు, మొదటి కుటుంబరాజకీయాలు, కుటుంబ సభ్యుల మీద అవినీతి కేసులు గురించి మాట్లాడారు. అందుకే వారు ఓడిపోవాలి,  వారిని ఎదగనీయవద్దు అంటూ చెప్పుకొచ్చారు. 

"రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ సమర్పించడానికి ఎంకె స్టాలిన్ గవర్నర్ వద్దకు వెళుతున్నారు, కాని అతను 2 జి స్కామ్ ఫేమ్ ఎ రాజాను తనతో పాటు తీసుకెళ్లాడు" అంటూ గురుమూర్తి చమత్కరించారు.