అమిత్ షాకు భోజనం పెట్టిన గిరిజన మహిళకు అధికార తృణమూల్ కాంగ్రెస్ తాజాగా హోం గార్డు ఉద్యోగం ఇచ్చింది. 2017లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌షా సిలిగురిలో ఒక గిరిజన మహిళ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ మహిళ పేరు గీతా మహిలి. 

స్థానిక నాయకులు ఆమె నియామక పత్రాలను నేరుగా మహలి ఇంటికి వెళ్లి అందజేశారు. నక్సల్‌బరి పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా గీతా మహిలిని  మమతా బెనర్జీ సర్కార్ నియమించింది. 

అమిత్‌షా గురువారంనాడు పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే మహిలికి ఈ ఉద్యోగ అవకాశం దక్కింది. దీనిమీద మహిలి స్పందిస్తూ  'చాలా సంతోషంగా ఉంది. టీఎంసీ ఇప్పటికే నాకు ఇల్లు కట్టించి ఇచ్చింది. గ్యాస్ సిలెండర్ ఇచ్చింది. ఇవాళ ఉద్యోగావకాశం కల్పించింది. దీంతో నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పోషించుకోగలుగుతాను' అని మహిలి సంతోషం వ్యక్తం చేసింది.

మూడేళ్ల క్రితం అమిత్‌షా మహలి ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఆమె, ఆమె భర్త రాజు మహలి టీఎంసీలో చేరారు. మహిలికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన టీఎంసీ జిల్లా అధ్యక్షుడు రంజన్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ కేవలం గిరిజనులకు తప్పుడు హామీలివ్వడానికే పరిమితమైందన్నారు. మూడేళ్ల క్రితం మహలి ఇంట్లో లంచ్ చేసిన సమయంలో ఆ పార్టీ చాలా హామీలే ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ఆమె ముఖం చూడనేలేది అన్నారు. మమతా బెనర్జీ స్వయంగా ఆమె యోగక్షేమాలు చూసుకున్నారని, ఉద్యోగం కూడా కల్పించారని ఆయన చెప్పారు.

కాగా, గీతా మహలికి టీఎంసీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన సమయంపై బీజేపీ ప్రశ్నలు గుప్పించింది. గిరిజనుల అభివృద్ధిని కాంక్షించే ఉద్దేశం ఇందులో ఎంతమాత్రం లేదని, అమిత్‌షా బెంగాల్‌కు వచ్చిన సమయం చూసుకుని మరీ రాజకీయాలకు టీఎంసీ పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. టీఎంసీ ఉద్యోగాలు ఇస్తామంటే తమ మంత్రులంతా ఇంటింటికి వెళ్లి భోజనాలు చేస్తారని అన్నారు.