ఇప్పటికే కామాంధుల కామ దాహానికి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బలైపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూగజీవాలను కూడా వదలదడం లేదు దుర్మార్గులు. కేరళలోని కాసర్‌గాడ్ జిల్లాలో గర్భవతిగా వున్న మేకపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

కామాతురానాం..న భయం న లజ్జ.. అన్నట్లు కామంతో ఈ మధ్య కొందరు విపరీతమైన సెక్స్ పోకడలకు పోతూ.. ఎంత నీచానికి దిగజారుతారో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. కేరళలోని (kerala) కాసర్‌గాడ్ జిల్లా (kasargod district) కన్హంగాడ్ పట్టణంలో (kanhangad) నిండు గర్బిణీ అయిన మేకపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతో పాటు దానిని హతమార్చారు. హోస్‌దుర్గ్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తచేరిలోని (Kottachery) ఎలైట్ హోటల్‌కు (Elite Hotel) చెందిన మేక నాలుగు నెలల గర్బిణీ.. మరో నెల రోజుల్లో ప్రసవించనుంది. ఈ ఘటనకు సంబంధించి హోస్‌దుర్గ్ పోలీసులు సదరు హోటల్‌లో పనిచేస్తున్న సెంథిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో వున్నారు. 

బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో హోటల్ ఉద్యోగులకు పెరటి వైపున ఏదో గొడవ జరుగుతున్నట్లుగా అరుపులు వినిపించాయి. రెండు మేకలు అదే పనిగా అరుస్తుండటాన్ని (వీటిలో ఒకటి గర్భవతి) గమనించారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మేకపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు పరిగెత్తారు. ఈ క్రమంలో సెంథిల్‌ వీరికి పట్టుబడగా.. మరో ఇద్దరు వ్యక్తులు గోడ దూకి పారిపోయారు. 

ఈ ఘటనలో గర్భవతి అయిన మేక అప్పటికే ప్రాణాలు కోల్పోగా.. హోస్‌దుర్గ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సెంథిల్‌ను అదుపులోకి తీసుకుని.. మేకను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళనాడుకు చెందిన సెంథిల్ మూడున్నర నెలల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్లు హోటల్ యజమాని తెలిపారు. 

నిందితులపై జంతు హింస నిరోధక చట్టంలోని (Prevention of Cruelty to Animals Act) సంబంధిత సెక్షన్ల కింద ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 377 కింద, అసహజ నేరాల కింద అభియోగాలను మోపనున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే వారికి జీవితకాలం లేదా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించడంతో జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.