ఫోటోల సరదా మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన కర్ణాటకలోకి చిక్కబళ్ళాపూర్ లో చోటుచేసుకుంది. 

బెంగళూరు : ఫోటోల సరదా ముగ్గురిని బలితీసుకున్న విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. స్నేహితులంతా కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లగా కొందరు నీటిలోకి దిగి ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. 

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ డి.ఫార్మసి కాలేజిలో చదివే విద్యార్థులు కొందరు శనివారం సరదాగా గడిపేందుకు చిక్కబళ్లాపురంలోని శ్రీనివాస సాగర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. వీరిలో కొందరు విద్యార్థులు లోతు తక్కువగా వుందని భావించి రిజర్వాయర్ నీటిలోకి దిగి ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే పూజ(21), రాధిక(21), ఇమ్రాన్ ఖాన్(21) ఫోటోలు దిగుతూ దిగుతూ లోతులోకి వెళ్లి గల్లంతయ్యారు. 

స్నేహితులు నీటిలో మునిగిపోవడంతో కంగారుపడిపోయిన మిగతావారు కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని కాపాడే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే నీటమునిగి ఊపిరాడక ఇమ్రాన్, రాధిక మృతిచెందగా కొన ఊపిరితో వున్న పూజను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.

Read More కారుపై పెట్రోల్ పోసి టెక్కీని తగులబెట్టారు, అక్రమ సంబంధమే...

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిక్కబళ్లాపురం పోలీసులు మృతుల వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఘటనాస్థలి నుండి విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్కబళ్ళాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఫోటోల సరదా ముగ్గురి నిండు ప్రాణాలను బలితీసుకుని వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ప్రమాదకర ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం ప్రయత్నించవద్దని ఎంత హెచ్చరించినా యువతీయువకుల తీరులో మార్పు రావడం లేదు. సోషల్ మీడియా వాడకమే యువతలో ఈ ఫోటోలు, వీడియోల పిచ్చికి కారణం. కాబట్టి తమ పిల్లలను సెల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి కాస్త దూరం వుంచి ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని సూచిస్తున్నారు.