కారుతో సహ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను దహనం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామ సమీపంలో నాగరాజు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరును కారులోనే దుండగులు దహనం చేశారు. నాగరాజు కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కావడమే కాకుండా నాగరాజు కూడా ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదయ్యాడు.
ఆ సంఘటన శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న నాగరాజు వారాంతం కావడంతో తిరుపతి వచ్చాడు. కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో చైన్, చెప్పులు, పెట్రోల్ బాటిల్ కనిపించాయి. వాటి ఆధారంగానే నాగరాజును గుర్తించారు.
Read More శ్రీకాళహస్తిలో కీచక బస్ డ్రైవర్.. ఆరో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి లైంగిక వేధింపులు..
అయితే, నాగరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, కారులో నాగరాజుతో పాటు ఎవరైనా ప్రయాణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులోని గంగుడుపల్లె వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తిగా కాలిన స్థితిలో కారును గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారుతో పాటు అందులోని వ్యక్తి పూర్తిగా దహనమైపోయి వున్నాడు. కారు నెంబర్ ఆధారంగా వివరాలను సేకరించిన పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
