ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్ కు హత్యా బెదిరింపులు వచ్చాయని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. వాట్సప్ ద్వారా, ఓ వెబ్ సైట్ ద్వారా దుండుగులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె మీడియాతో అన్నారు.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు వాట్సప్ లో హత్యా బెదిరింపులు వచ్చాయని ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. తన తండ్రిని ఓ వెబ్ సైట్ ద్వారా కూడా బెదిరింపులకు గురి చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు సుప్రియా సూలే చెప్పారు.
‘‘పవార్ సాహెబ్ కోసం నాకు వాట్సప్ లో మెసేజ్ వచ్చింది. ఓ వెబ్ సైట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాను. ఈ విషయంపై స్పందించాలని మహారాష్ట్ర హోం మంత్రిని, కేంద్ర హోం మంత్రిని కోరుతున్నాను. ఇలాంటి చర్యలు నీచమైన రాజకీయమని, దీన్ని ఆపాలి’’ అని ఆమె తెలిపారు.
పవార్ సాహెబ్ భద్రత బాధ్యత హోం మంత్రిత్వ శాఖదేనని సుప్రియా సూలే చెప్పారు. కాగా.. శరతద్ పవార్ ను బెదిరింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తనకు హామీ ఇచ్చారని ఆమె మీడియాతో తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు హత్యా బెదిరింపులు రావడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది డిసెంబర్ రెండో వారంలో కూడా ఆయనకు ఈ విధంగానే బెదింపులకు వచ్చాయి. ఆయనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి హిందీలో మాట్లాడాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ చంపేస్తానని బెదిరించాడు. అదే నెంబర్ నుంచి దాదాపు 20 నుంచి 25 కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ బెదిరింపులకు పాల్పడింది బీహార్ వాసి అని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే వ్యక్తి శరద్ పవార్‌కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాని చెప్పారు. ఆ సమయంలోనే అంతకు ముందే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం విడుదల చేశారు. కాగా.. తాజా కేసులోనూ నిందితుడిని పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకోనున్నారు.