త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ హత్యకు మాఫియా కుట్ర పన్నినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ వాడకాన్ని అరికట్టారు.. డ్రగ్స్ మాఫియాను అణచివేసేందుకు ‘‘నిషా ముక్త్ భారత్’’ కార్యక్రమాన్ని చేపట్టారు.

దీనిలో భాగంగా త్రిపుర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కేజీల హెరాయిన్‌, గంజాయి, బ్రౌన్ షుగర్‌ను పట్టుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ రవాణాలో కీలకంగా వ్యవహారిస్తున్న 120 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ పక్కనే ఉన్న మయాన్మార్ నుంచి దేశంలోకి వస్తున్నట్లు తేలింది.

తమ వ్యాపారాన్ని దెబ్బకొట్టిన ముఖ్యమంత్రిపై కక్ష కట్టిన డ్రగ్స్ మాఫియా ఆయన్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించి పక్కగా స్కెచ్ గీసిందట. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా కేంద్ర హోంశాఖకు చేరింది. వెంటనే ఈ కుట్రను హోంశాఖ త్రిపుర ప్రభుత్వానికి తెలిపింది. కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.