ఆ స్కూల్లో పిల్లల్ని చేర్చితే.. బంగారం ఇస్తారట

This Tamil Nadu village woos children to school with gold, cash
Highlights

గోల్డ్, క్యాష్ ఆఫర్ చేస్తున్న స్కూల్

ప్రైవేట్ పాఠశాలల మీద జనానికి ఉన్న మోజుని ప్రభుత్వ పాఠశాలల వైపు మరల్చేందుకు ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒకప్పుడు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు సాగించేవారు. ప్రైవేటు పాఠశాలలు విద్యా రంగంలోకి అడుగుపెట్టి విద్యను వ్యాపారం చేసేశాయి. కొత్త కొత్త కోర్సులు చెప్పి.. తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కూడా ఖర్చు కు వెనకాడకుండా ప్రైవేటు బడుల్లోనే చేర్పిస్తున్నారు.

అయితే.. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోవని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆకట్టుకునేందుకు బంగారం, డబ్బు ఇస్తామంటూ ఆఫర్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని కోనార్పలాయం గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూతపడే స్థితికి చేరుకుంది. దీంతో ఆ పాఠశాల అధికారులు ఓ సరికొత్త ప్రణాళికను రూపొందించారు. ఈ స్కూలులో అడ్మిషన్ తీసుకున్న తొలి 10 మంది చిన్నారులకు ఒక గ్రాము బంగారు నాణెం, ఐదు వేల నగదు, రెండు యూనిఫారాల జతలు ఉచితంగా అందించనున్నారు. ఈ పాఠశాల 1996లో 165 మంది చిన్నారులతో ప్రారంభమైంది. స్కూల్లో రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 10 మంది మాత్రమే విద్యార్థులు చదువుకుంటున్నారు. తమ పాఠశాల మూతపడకుండా, గత వైభవాన్ని తీసుకురావడానికి ఈ ఆలోచన చేసినట్టున్నారు అధికారులు. వినియోగదారులను ఆకర్షించినట్టు విద్యార్థులను ఆకర్షించటానికి ఈ స్కూలు తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు అందుతున్నాయి.

స్కూలు హెడ్ మాస్టర్ రాజేష్ చంద్రకుమార్ మాట్లాడుతూ ‘గ్రామాల్లో తక్షణం ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే ముగ్గురు చిన్నారులు పాఠశాలలో చేరారు’ అని తెలిపారు. తాను గ్రామీణులతో మాట్లాడి ఈ పథకాన్ని ప్రారంభించానని, దీనికి ఖర్చు అయ్యే మొత్తాన్ని ఇద్దరు దాతలు అందజేస్తున్నట్టు తెలిపారు. కొంత మంది తమ పిల్లలను ఆ స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు.

loader