ఇదే కదా తల్లి ప్రేమంటే.. లేగను వేటాడేందుకు వచ్చిన పులినే వెంటాడిన ఆవు.. వీడియో వైరల్..
ఓ లేగ దూడను వేటాడేందుకు వచ్చిన పులిని తల్లి ఆవు తరిమికొట్టింది. ఆ ఆవు కోపాన్ని చూసిన ఆ క్రూర జంతువు కూడా తోక ముడిచి అక్కడి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఇప్పుడది వైరల్ గా మారింది.
తల్లి ప్రేమకు హద్దులు లేవు. తన బిడ్దల కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఎంత దూరమైన వెళ్తుంది. ఎవరైనా ఎదురిస్తుంది. బిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే తల్లి చూడలేదు. వారి క్షేమమే తనకు ముఖ్యమనుకుంటుంది. ఈ బంధాలు, ఆత్మీయతలు కేవలం మనుషులకే పరిమితం కాదు. జంతువులు, ఇతర జీవులూ కూడా తమ బిడ్దల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడుతాయి. క్రూరమైన జంతువులకు కూడా ఎదురు నిలుస్తాయనే వాస్తవాన్ని తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు.
త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం.. జాతీయ జెండాతో చికెన్ శుభ్రం.. వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్..
అడవిని అనుకోని ఉన్న గ్రామాల్లోకి, చేన్లలోకి పులులు, ఇతర అడవి జంతువులు వస్తుండటం సర్వ సాధారణమే. ఈ సమయాల్లో అవి ఇతర పెంపుడు జంతువులపై దాడి చేయడం, వాటిని చంపితినడం వంటివి చేస్తుంటాయి. కొన్ని సార్లు పంటలను ధ్వంసం చేస్తాయి. పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు అయితే కొన్ని సార్లు మనుషులపై కూడా దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనల్లో కొన్ని సార్లు మనుషులు కూడా చనిపోతారు. క్రూర జంతువుల దాడికి మూగ జీవాలు కూడా బలి అవుతాయి.
అయితే ఇటీవల అడవిని ఆనుకొని ఉన్న గ్రామ పరిసరాల్లోకి ఓ పులి చొరబడింది. ఆ పచ్చిక మైదానాల్లో గ్రామానికి చెందిన ఓ ఆవుల గుంపు ఉంది. వెంటనే పులి ఆవులపై దాడి చేయడానికి పరిగెత్తింది. దీనిని గమనించిన ఆవులు అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పులి ఓ లేగ దూడనే లక్ష్యంగా చేసికొని దాని వెంట పడింది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ లేగదూడ ఓ ప్రదేశంలో పులికి చిక్కింది. పులిదాడికి ఆ లేగ అల్లాడిపోతూ అరిచింది. ఈ అరుపులు విన్న తల్లి ఆవు వెంటనే ఆ పులివైపు వేగంగా పరిగెత్తుకొచ్చింది.
ఎదురుగా ఉన్నది పులి అని కూడా చూడకుండా దానిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. తల్లి ఆవు కోపంతో పరిగెత్తుకు రావడాన్ని గమనించిన పులి అక్కడి నుంచి పారిపోయింది. ఆ క్రూర జంతువును చాలా దూరం తరిమేసేదాకా ఆ ఆవు ఊరుకోలేదు. చివరికి తన బిడ్డ క్షేమంగా ఉందని నిర్ధారించుకొని ఆగిపోయింది. ఈ పరిణామం మొత్తాన్ని అక్కడున్న పలువురు వీడియో తీశారు. దీనిని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.63 లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.