ఓటమి భారం దిగేలా .. గుండెలకు హత్తుకుని: నేడు టీమిండియా మెన్స్.. నాడు భారత మహిళల జట్టుకు మోడీ భరోసా
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన టీమిండియా క్రికెటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చారు. అయితే గతంలో 2017లోనూ టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసినా గెలవలేకపోయింది. అప్పుడు మహిళా క్రికెటర్లకు మోడీ ధైర్యం చెప్పారు.
వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో 140 కోట్ల మంది భారతీయుల స్వప్నం చెదిరిపోయింది. భారత జట్టు ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మైదానంలో ఆడిన ఆటగాళ్ల పరిస్ధితేంటీ..? అయితే ఫైనల్‌లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన టీమిండియా క్రికెటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చారు.
నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన ప్రధాని మోడీ.. పేసర్ మహ్మద్ షమీని ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆటగాళ్లతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే ఎక్స్‌లోనూ ట్వీట్ చేశారు. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి, గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారని, ఎల్లప్పుడూ మీకు మద్ధతుగా వుంటామని ప్రధాని పేర్కొన్నారు. అయితే గతంలో 2017లోనూ టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసినా గెలవలేకపోయింది. అప్పుడు మహిళా క్రికెటర్లకు కూడా మోడీ ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని అదే ఏడాది జరిగిన మన్ కీ బాత్‌తో ప్రధాని వెల్లడించారు.
అప్పుడు మోడీ ఏమన్నారంటే.. ‘‘ ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో మా కుమార్తెలు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ వారం ఆ పిల్లలందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. నేను వారితో మాట్లాడటాన్ని ఆనందించాను, కానీ ప్రపంచకప్ గెలవలేకపోవడం వారిపై పెద్ద భారంగా భావించాను. కుమార్తెల ముఖంలో కూడా ఒత్తిడి, టెన్షన్ కనిపించాయి. భారత ఆటగాళ్లు విఫలమైతే ఆ దేశపు కోపం ఆ ఆటగాళ్లపై పడుతుందని ఎన్నో చూశాం. కొందరైతే హద్దులు తెంచుకుని మాట్లాడడం, రాయడం చేస్తే చాలా బాధ కలుగుతుంది ’’.
‘‘ అయితే తొలిసారిగా మన ఆడపడుచులు ప్రపంచకప్‌లో రాణించలేనప్పుడు 125 కోట్ల మంది దేశప్రజలు ఆ ఓటమిని తమ భుజాలపై వేసుకున్నారు. ఆ కూతుళ్లపై కనీస భారం కూడా పడలేదని, అంతే కాదు.. ఈ కుమార్తెలు చేసిన పనిని కొనియాడారు, గర్వపడేలా చేశారు. నేను దీనిని ఒక సంతోషకరమైన మార్పుగా చూస్తున్నాను , నేను ఈ కుమార్తెలకు ఏం చెప్పానంటే.. మీకు మాత్రమే అలాంటి అదృష్టం లభించింది ’’.
‘‘ మీరు విజయవంతం కాలేదన్న విషయాన్ని మీ మనస్సు నుండి తొలగించండి. మీరు మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా 125 కోట్ల మంది దేశ ప్రజలను గెలిపించారు. నిజానికి, మన దేశంలోని యువతరం, ముఖ్యంగా మన కుమార్తెలు, నిజంగా భారత్‌కు కీర్తిని తీసుకురావడానికి చాలా చేస్తున్నారు. మరోసారి దేశంలోని యువతరాన్ని, ముఖ్యంగా మన కుమార్తెలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీకు అంత మంచి జరగాలని ఆశిస్తున్నాను. ’’ అని మన్‌కీ బాత్‌తో ప్రస్తావించారు ప్రధాని ’’.