Mumbai: మహారాష్ట్రలో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి-షోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు.
PM Modi Mumbai Visit: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో రైల్వేలకు విప్లవం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్రలో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి-షోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించిన సందర్భంగా ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ముంబయిలో పర్యటించారు. ఈ క్రమంలోనే ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం ఏక్నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు పాల్గొన్నారు.
ఈ సమయంలో ముంబైలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి వందే భారత్ రైలు ప్రతి ఒక్కరికీ మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. "ఇది రైల్వేలకు విప్లవం. వందే భారత్ రైలు నేటి ఆధునిక భారతదేశానికి అద్భుతమైన చిత్రం. ఇది భారతదేశ వేగం, స్థాయి రెండింటికి ప్రతిబింబం. ఇప్పటి వరకు ఇటువంటి 10 రైళ్లు ప్రారంభమయ్యాయి. 17 రాష్ట్రాల్లోని 108 జిల్లాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అనుసంధానించబడ్డాయి" అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఈ రోజు ఏకకాలంలో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు. ఇది ముంబయి-పూణే వంటి ఆర్థిక కేంద్రాలను తమ శక్తి-భక్తి కేంద్రాలతో అనుసంధానిస్తుందని తెలిపారు. దీంతో కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే ప్రజలు, రైతులు, భక్తులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. భారతీయ రైల్వేలకు.. ముఖ్యంగా ముంబయి, మహారాష్ట్రల కనెక్టివిటీకి ఈ రోజు గొప్ప రోజుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. "ఇది అందరికీ మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది మహారాష్ట్రలో పర్యాటకం-తీర్థయాత్రలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇవ్వబోతోంది" అని తెలిపారు.
