Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుంచి మూడో డోసు పంపిణీ షురూ.. అర్హులు, డోసుల మధ్య గ్యాప్, రిజిస్ట్రేషన్, వేసే టీకా, ఇతర వివరాలు ఇవే

మన దేశంలో రేపటి నుంచి మూడో డోసు పంపిణీ ప్రారంభం కాబోతున్నది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల‌తోపాటు 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మూడో డోసును పొందనున్నారు. బూస్టర్ డోసు తీసుకోవడానికి వీరు అర్హులు. ఈ నేపథ్యంలోనే మూడో డోసు తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు, రెండో డోసు తర్వాత ఎన్ని రోజులకు మూడో డోసు వేస్తారు? దాని రిజిస్ట్రేషన్, మూడో డోసుగా వేసే టీకా వివరాలను తెలుసుకుందాం.

third dose vaccination to start from tomorrow
Author
New Delhi, First Published Jan 9, 2022, 3:50 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Varitant) దేశవ్యాప్తంగా భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే మూడో డోసు (ప్రికాషన్ డోసు/ Precaution Dose) వేయాలని నిర్ణయించింది. గత నెల 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బూస్టర్ డోసుపై ప్రకటన చేశారు. ఈ నెల 10వ తేదీ అంటే.. రేపటి నుంచి ఈ మూడో డోసు పంపిణీ ప్రారంభం కానుంది. శనివారం నుంచే ఈ ముందస్తు జాగ్రత్తగా తీసుకునే డోసు కోసం అపాయింట్‌మెంట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. అర్హులైన(Eligible) వారు నేరుగా టీకా పంపిణీ(Vaccination) కేంద్రాలకు వెళ్లి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెప్పారు. ఈ డోసు పంపిణీ, అర్హులు, డోసుల మధ్య ఉండాల్సిన వ్యవధి, అపాయింట్‌మెంట్ నమోదు, ఏ టీకా వేస్తారు అనే విషయాలను పరిశీలిద్దాం.

మూడో డోసుకు ఎవరు అర్హులు?
కేవలం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మూడో డోసు వేసుకోవడానికి అర్హులు. వీరంతా మూడో డోసు కోసం అపాయింట్‌మెంట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే, కోమార్బిడిటీస్‌లోనూ కొన్నింటినే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటున్నది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కార్డియోవస్కులర్ డిసీజ్, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ రిసీపెంట్స్, సిర్రోసిస్, క్యాన్సర్, సికల్ సెల్ డిసీజ్‌లతోపాటు మరికొన్నింటినీ మూడో డోసు అర్హత కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారు.

రెండో డోసు తర్వాత ఎంత వ్యవధి అవసరం?
రెండు డోసుల టీకా తీసుకున్నవారికి మాత్రమే మూడో డోసు వేస్తారు. రెండో డోసు వేసుకున్న 9 నెలల తర్వాత లేదా 39 వారాల తర్వాత మూడో డోసు వేసుకోవడానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది.

ఏ టీకా వేస్తారు?
గతంలో తొలుత వేసిన రెండో డోసుల టీకాకు భిన్నమైన టీకానే మూడో డోసుగా వేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇది నిజం కాదని తేలిపోయింది. గతంలో వేసుకున్న టీకానే మూడో డోసుగా వేస్తారు. తొలి రెండు డోసులుగా ఒక టీకా.. మూడో డోసుగా మరో టీకాను వేయబోరు. ఇలా ఒకటికి మించి టీకాలను వేయాలనే ఆలోచనలు చేయలేదు. కాబట్టి, తొలి రెండు డోసులుగా కొవిషీల్డ్ టీకా తీసుకుని ఉంటే.. మూడో డోసుగానే అదే టీకా డోసు వేస్తారు. లేదా తొలి రెండు డోసులుగా కొవాగ్జిన్ తీసుకుంటే.. మూడో డోసుగా అదే టీకాను వేస్తారు.

మూడో డోసు కోసం నమోదు ఎలా?
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాల వ్యాధులున్న వారు మూడో డోసు పొందడానికి అర్హులు. వీరు తొలి రెండు డోసుల కోసం వినియోగించిన కొవిడ్ అకౌంట్‌లోనే మూడో డోసు కోసం అపాయింట్‌మెంట్‌ను నమోదు చేసుకోవచ్చు. మూడో డోసు కోసం అర్హులు ముందస్తుగానే రిజిస్టర్  చేసుకోవచ్చు. లేదా నేరుగా టీకా పంపిణీ కేంద్రంలోకి వెళ్లి నమోదు చేసుకుని టీకా వేసుకోవచ్చు. కొవిన్ పోర్టల్‌లో చూపిస్తున్న రెండో డోసు వేసిన తేదీ ఆధారంగా అందులో ఎలిజిబిలిటీని చూపిస్తుంది. ఆధార్ నెంబర్‌తో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios