పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ కూడా బీజేపీని తీవ్రంగా ఆక్షేపించారు. ఆ పార్టీ నాయకులు రావణ భక్తులని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదుల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు టిక్కెట్లను పంపిణీ చేసిన విధంగా, ఇప్పుడు పెట్రోల్ కు కూడా కూపన్లు పంపిణీ చేయాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని అన్నారు. ఆ పార్టీ నాయకులు రావణ భక్తులు అని, రామభక్తులు కారని అన్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ మంత్రి చేసిన తరహా వ్యాఖ్యల మాదిరిగానే గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా బీజేపీని ఇలానే విమర్శించారు. “ వారు (బీజేపీ నాయకులు) రాముడి విధానాన్ని అనుసరించరు. వారు రావణుడి విధానాన్ని అనుసరిస్తారు. రావణుడు మోసగాడు కానీ రాముడు ఎవరినీ మోసం చేయలేదు. శ్రీరాముడు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరితో మంచిగానే వ్యవహరించాడు. బీజేపీ వారు రామభక్తులు కారు. వారు రావణ భక్తులు’’ అని తీవ్రంగా ఆరోపించారు.
గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడో సారి మంగళవారం పెట్రోల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఇటీవలీ కాలంలో మొత్తంగా రూ.4.80 ధర పెరిగింది. ఈ కొత్త పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ రూ.100 మార్కును అధిగమించింది. ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఎన్నికలు జరగడానికి నాలుగు నెలల ముందు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇంధన ఖర్చులు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం లాభం కోసం పని చేస్తోందని ఆరోపించారు. ఈ వారంలో మూడు దశల 'మెహంగై ముక్త్ భారత్ అభియాన్' నిర్వహించాలని ప్రకటించారు. కాగా ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను స్తంభింపజేయడం ద్వారా ఏకంగా రూ.19,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని గత వారం మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లు పేర్కొన్నాయి.
కాగా ప్రస్తుతం పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21 కాగా, డీజిల్ రూ. 91.47 గా ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 115.04 కాగా, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94 కాగా, డీజిల్ రూ. 96.00గా ఉంది. అలాగే బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 105.62 కాగా, డీజిల్ రూ. 89.70గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.68 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 113.61, డీజిల్ రూ. 99.84గా ఉంది.
