దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతంతో వైరస్‌ను అదుపులో పెట్టాలంటే అందుకు టీకా ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు.

దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు నిండిన వారందరూ టీకాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ఉత్తరప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ట్విటర్‌‌లో ప్రకటించారు. బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:కరోనా టీకా: అమెరికా 101 రోజులు, చైనా 109 రోజులు.. 95 రోజుల్లోనే కొట్టేసిన ఇండియా

అటు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు వ్యాక్సిన్‌ కొనుగోలులో రాష్ట్రాలకు, తయారీ సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం గత సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీకా తయారీదారులు... 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి అనుమతి కల్పించింది.

ఈ నేపథ్యంలోనే సీరమ్‌ సంస్థ తన కొవిషీల్డ్‌ టీకా ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసును రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు వెల్లడించింది.