సారాంశం

హిందూ అనే మతం లేదని, అదంతా బూటకమని సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. బ్రాహ్మణ మతాన్నే హిందూ మతంగా చెబుతున్నారని తెలిపారు. దీని వల్ల దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల ప్రజలను ఇరికించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య మరో సారి హిందూ మతాన్ని విమర్శించారు. హిందూ మతం ఒక మతం కాదని, అదొక బూటకమని అన్నారు. ఆ మతాన్ని హిందూ మతం అని కాకుండా బ్రాహ్మణిజం అనాలని ఆయన అన్నారు. గతంలో రామచరిత మానస్ పై వ్యాఖ్యలు చేసిన ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

ఆయన తన ఎక్స (ట్విట్టర్) ఖాతాల్లో షేర్ చేసిన ఓ వీడియోలో ఆయన హిందూ మతాన్ని విమర్శిస్తూ కనిపించారు. ‘‘హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం. బ్రాహ్మణ మతాన్ని హిందూ మతంగా పేర్కొనడం ద్వారా ఈ దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల ప్రజలను ఇరికించడానికి కుట్ర జరుగుతోంది. ఇది వాస్తవానికి బ్రాహ్మణ మతం’’ అని మౌర్య అన్నారు. హిందూ మతం ఉండి ఉంటే గిరిజనులను గౌరవించేవారని అని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అలాగే దళితులకు, వెనకబడిన తరగతుల వారికి గౌరవం లభించేదని చెప్పారు. 

కాగా.. ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తాను హిందువునని ప్రకటించిన నేపథ్యంలో మౌర్య ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాది జనవరిలో ఆయన రామచరితమానస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. మత గ్రంథం "అన్నీ నాన్సెన్స్" అని అన్నారు.

‘ఆజ్ తక్’ తో జరిగిన సంభాషణలో మౌర్య మాట్లాడుతూ.. ‘‘కోట్లాది మంది రామచరిత మానస్ చదవరు. ఇదంతా చెత్త. దీనిని తులసీదాస్ తన సంతోషం కోసం రాశారు.’’ అని ఆయన అన్నారు. ఏ మతమైనా దాన్ని గౌరవిస్తామని, కానీ మతం పేరుతో ఫలానా కులాన్ని, ఒక వర్గాన్ని కించపరిచే పని (రామచరితమానస్ లో) జరిగిందని అన్నారు. దానిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ‘‘తులసీదాస్ రామచరిత మానస్ లో కొన్ని భాగాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఏ మతంలోనైనా ఎవరినీ దూషించే హక్కు ఎవరికీ లేదు.’’ అని ఆయన అన్నారు. కాగా. రామచరిత్రమానస్ పై మౌర్య చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.